న్యూఢిల్లీ : చెల్లని వివాహాల నుంచి పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.అలాంటి పిల్లలకు చట్టబద్ధత కల్పించబడుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించిన తీర్పులో పేర్కొంది. హిందూ వారసత్వం చట్టాల ప్రకారం మాత్రమే తల్లిదండ్రుల ఆస్తిపై హక్కులు పొందవచ్చని పేర్కొంది. చెల్లని వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా లేదా హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన ఆస్తులపై కాపర్సనరీ హక్కు ఉందా అనే చట్టపరమైన సమస్యపై 2011 నుంచి పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై తీర్పు ఇచ్చింది.
గత నెల నుంచి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పలువురు న్యాయవాదుల వాదనలను విచారించింది. 2011లో సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇలాంటి పిల్లలకు తల్లిదండ్రుల స్వీయ ఆర్జిత ఆస్తిలో మాత్రమే వాటా ఉంటుందని, వారి పూర్వీకుల కాపర్సెనరీ ఆస్తిలో వాటాను కోరలేరని, అందుకు వారికి అర్హత ఉండదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పును అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. లివ్ ఇన్ రిలేషన్ ద్వారా పుట్టిన పిల్లలకు వారి పూర్వీకుల ఆస్తిలో వాటాకు అర్హులే అని సుప్రీం అభిప్రాయపడింది.