హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెలువరించనుంది. ఈక్రమంలో దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై సుదీర్ఘ విచారణ చేసిన కమిషన్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసి ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసింది. ఈ నివేదికలో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కమిషన్ విచారించిన అంశాలను పొందుపరిచింది. అలాగే ఎన్‌కౌంటర్, మృతదేహానికి పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులతో పాటు బాధిత దిశ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసిన కమిషన్ పూర్తి వివరాలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకి అందజేసింది.
దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న క్రమంలో ఈ ఎన్ కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇవ్వనుంది. తెలంగాణ హైకోర్టు వేదికగా రెండున్నర సంవత్సరాల పాటు కమిషన్ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో దిశ ఎన్‌కౌంటర్ ఫేక్ ఎన్ కౌంటర్ ? ఎన్ కౌంటర్ అనే దానిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది. ఇదిలావుండగా దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్ శుక్రవారం జరిగే విచారణకు హాజరు కానున్నారు.
ఇది జరిగింది…
2019, నవంబర్ 27వ తేదీ అర్థరాత్రి దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి దారుణంగా మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. ఈ కేసులో నిందితులను 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకుని షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హత్యాచార సంఘటనలో 2019, డిసెంబర్ 6న చటాన్‌పల్లి వద్ద నిందితులైన నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్, గుడిగండ్లకు చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు