Sunday, December 22, 2024

వలసలపై రాజకీయ రాద్ధాంతమేల?

- Advertisement -
- Advertisement -

అసోం ఒప్పందంలో నిర్దేశించిన షరతులతో రూపొందించిన ప్రత్యేక నిబంధనగా పౌరసత్వ చట్టంలో చేర్చిన 6ఎ సెక్షన్‌పై సుప్రీం కోర్టు తీర్పును అసోంలోని వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థులు, యువజన సంఘాలు ఈ నెల 17న స్వాగతించాయి. ఆరు సంవత్సరాల పాటు హింసాత్మకంగా సాగిన విదేశీయుల వ్యతిరేక ఉద్యమం అనంతరం 1985లో అసోం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 1971 మార్చి 25 తరువాత అసోంలోకి ప్రవేశిస్తున్న విదేశీయుల పేర్లను కనిపెట్టి, ఓటర్ల జాబితాల్లో నుంచి తొలగించి, వారిని తిప్పి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఇతర క్లాజులతో పాటు ఆ ఒప్పందం స్పష్టం చేసింది.

1966 జనవరి 1, 1971 మార్చి 25 మధ్య అసోంకు వచ్చిన వలస ప్రజలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేస్తున్న పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పులో ధ్రువీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం అసోంలో ప్రవేశానికి, పౌరసత్వం మంజూరుకు 1971 మార్చి 25ను కటాఫ్ తేదీగా నిర్ణయించడం సరైనదేనని కూడా ధ్రువీకరించింది.
విదేశీ జాతీయులకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలసి అసోం ఉద్యమానికి సారథ్యం వహించిన అఖిల అస్సాం విద్యార్థి యూనియన్ (ఎఎఎస్‌యు ఆసు) ఆ తీర్పును అసోం ఒప్పందం విజయంగా అభివర్ణించింది. అసోం ఉద్యమం, అసోం ఒప్పందం హేతుబద్ధతను ఆ తీర్పు తిరిగి స్పష్టం చేసిందని ఆసు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందంలోని ప్రతి క్లాజును పూర్తిగా అమలు జరపాలని విద్యార్థి సంఘం మళ్లీ కోరింది.

ఎన్‌జిఒలు అసోం పబ్లిక్ వర్క్, అసోం సమ్మిళిత మహాసంఘ, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి లక్షాలపై నమ్మశక్యంగాని భారాన్ని మోపుతున్న, జనాభాపరమైన మార్పులు కలిగిస్తున్న అక్రమ వలసల ప్రవాహానికి కారణంగా 6ఎ సెక్షన్‌ను అవి గర్హించాయి. తమ రాజకీయ, భాషపరమైన, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు, సంరక్షణకు అసోం ప్రజలకు గల హక్కుకు ఆ సెక్షన్ ముప్పు అని ఎన్‌జిఒలు ఆరోపించాయి. సెక్షన్ 6ఎను వివక్షపూరితం, నిరంకుశం, అక్రమం అని ప్రకటించవలసిందిగా అవి సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాయి.

సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పలు ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31కు ముందు భారత్‌లో ప్రవేశించిన ముస్లింలు కాకుండా హిందు, సిక్కు, బౌద్ధులు, జైన్, పార్సీ లేదా క్రైస్తవ వర్గాలకు చెందిన శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేయాలని కోరుతున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)లోని సెక్షన్ 6బి కి చట్టంలోని సెక్షన్ 6ఎ చెల్లుబాటు విరుద్ధంగా ఉన్నది. అసోంతో సహా ఈశాన్య ప్రాంత రాష్ట్రాల ఇన్నర్ లైన్ పర్మిట్ పరిధిలోకి వచ్చే ఆరు షెడ్యూల్ ప్రాంతాలు, భాగాలను సిఎఎ మినహాయించిందన్నది గమనార్హం. ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పలు ఇతర సంస్థలు ఆ సవరణను సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఆ పిటిషన్ ఇప్పటికీ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నది. పౌరసత్వ సవరణ చట్టంలోని ధ్రువీకృత 6 క్లాజ్ కారణం గా 1971 మార్చి 25 తరువాత వలస వచ్చిన జైనులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, క్రైస్తవ శరణార్థులతో పాటు ఏ హిందువుకూ అసోంలో పౌరసత్వం ప్రదానం కాబోదు. సిఎఎ సెక్షన్ 6బి ఆరు ముస్లిమేతర మత వర్గాలకు పౌరసత్వం మంజూరుకు వర్తించబోదు.

అసోంలో పూర్తి అయిన జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి)లో దాదాపు 19 లక్షల పేర్లను జాబితాలో నుంచి తొలగించారు. అలా తొలగింపునకు గురైనవారిలో అధిక సంఖ్యాకులు బెంగాలీ ముస్లింలు. అధికార బిజెపి అసోం, పశ్చిమ బెంగాల్‌లో బెంగాలీ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన బెంగాలీ హిందువులకు పౌరసత్వం మంజూరు చేయడం. పౌరసత్వ చట్టం 6ఎ చెల్లుతుందని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో అధికార బిజెపికి ముఖ్యంగా అసోంలో సిఎఎ పేరిట ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందడం కష్టం అవుతుంది.
1979 నుంచి 1985 వరకు అసోం ఉద్యమానికి సారథ్యం వహించిన అఖిల అస్సాం విద్యార్థి యూనియన్ (ఆసు), ఇతర సంస్థలు అక్రమ శరణార్థులను గుర్తించి, తిప్పి పంపేందుకు ప్రాతిపదిక సంవత్సరం 1948 జులై 19 కావాలని తొలుత కోరాయి. కాని కేంద్రంలోని అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1971 కటాఫ్ సంవత్సరానికి కట్టుబడి ఉంది. దానిని అసోంలో ఆందోళనకారులైన విద్యార్ధులు, యువజన సంస్థలు తిరస్కరించాయి. తుదకు పలు సంప్రదింపుల అనంతరం ప్రాథమిక కటాఫ్ తేదీని 1966కు మార్చారు.

అయితే, 1966 జనవరి 1, 1971 మార్చి 24 మధ్య ప్రవేశించిన విదేశీ జాతీయులకు గుర్తించిన తేదీ నుంచి పది సంవత్సరాల వరకు ఏ ఓటింగ్ హక్కూ ఉండదు. తుది కటాఫ్ తేదీ 1971 మార్చి 25గానే కొనసాగింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అసోంలో ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా సారథ్యంలోని తమ సొంత పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ ఒప్పందంలోని షరతుల్లో అది ఒకటి. ఎఎఎస్‌ఐయు, ఆసు పూర్వపు నాయకులు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ అస్సాం గణ పరిషత్ (ఎజిపి), ఇతర సంస్థలు 1948 జులై 19ని కటాఫ్ తేదీగా కోరుతున్నందున అవి పౌరసత్వ చట్టం సెక్షన్ 6ఎ తొలగింపునకు వ్యతిరేకంగా కోర్టు కేసు దాఖలు చేసిన పిటిషనర్లకు మద్దతు ఇచ్చి ఉండవలసింది. అయితే, అసోం ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ నాయకులు అసోంలో విదేశీ జాతీయుల గుర్తింపునకు కటాఫ్ తేదీగా 1971 మార్చి 25ను నిర్ధారించే అసోం ఒప్పందాన్ని ఆమోదించక తప్పలేదు.

సిజెఐ చంద్రచూడ్ బహుశా ఈ సమస్యను అర్థం చేసుకుని ఉంటారు. అప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన, దేశంలోకి ప్రవేశించవచ్చునని భావిస్తున్న శరణార్థుల ప్రవాహాన్ని తట్టుకునేందుకు సెక్షన్ 6ఎను ప్రవేశపెట్టారని ఆయన అందుకే వివరించారు. భారతీయ రాష్ట్రాలపై అటువంటి వలస వల్ల ఆర్థిక, సాంస్కృతిక ప్రభావంతో భారత సంతతి శరణార్థులకు సంబంధించిన మానవతావాద ఆందోళనలను సమతుల్యం చేస్తూ అసోం ఒప్పందాన్ని ‘రాజకీయ పరిష్కారం’ గాను, సెక్షన్ 6ఎను ‘శాసనపరమైన పరిష్కారం’ గాను ఆయన అభివర్ణించారు. కటాఫ్ తేదీ 1971 మార్చి 25 సహేతుకమైనదేనని ఆయన అన్నారు. ఎందుకంటే అది 1971 మార్చి 25న పాకిస్తాన్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ తరువాత ప్రవేశించిన వారి నుంచి ‘విభజన శరణార్థులను’ గుర్తించింది. ఆ తరువాత ప్రవేశించినవారిని ‘యుద్ధ శరణార్థులు’ గా పరిగణించి, ఆ కారణంగా అక్రమ ప్రవేశకులుగా పేర్కొన్నారు. సమీపంలోని బంగ్లాదేశ్ నుంచి అధిక సంఖ్యలో విదేశీ జాతీయుల వలస అసోంలో జనాభాపరమైన మార్పునకు దారి తీసిందనడంలో సందేహం ఏమాత్రం లేదు. అయితే. ఆ వలసకు కారణం చారిత్రకమైనది, రాజకీయపరమైనది కూడా. ఆ సమస్యను రాజకీయ అంశం చేయడం లేదా న్యాయపరమైన యుద్ధంగా పరిగణించడం కన్నా ఆచరణాత్మక పరిష్కారం అవసరం.

గీతార్థ పాఠక్, ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News