Sunday, January 12, 2025

వివిప్యాట్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

ఇవిఎంల పనితీరుపై అపోహలు తొలగించాలి
విచారణ సందర్భంగా ఇసికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఇవిఎంల ద్వారా వేసే ఓట్లను, ఓటర్ వెరిఫైయబుల్ పపర్ ఆడిట్ ట్రయల్(వివిప్యాట్)తో 100 శాతం క్రాస్ చెక్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై ఎన్నికల కమిషన్ వాదనలు విన్న అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు దీనిపై ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియకు, ఇవిఎంలు, వివిప్యాట్‌ల పనితీరుకు సంబంధించి ఎటువంటి అపోహలకు అవకాశం ఇవ్వరాదని ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది.

వివిప్యాట్ స్లిప్పులను 100 శాతం లెక్కించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్బంగా ఇవిఎంల ద్వారా నిర్వహించే ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను సంపూర్ణంగా వివరించాలని ధర్మాసనం ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోర్టు లోపల, కోర్టు వెలుపల ఉన్నవారిలో అపోహలను మీరు కాని, ఎన్నికల కమిషన్ అధికారి కాని నివృత్తి చేయాలని ఇసి తరఫు న్యాయవాదిని న్యాయమూర్తులు కోరారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, ఊహించనిది ఏదో జరుగుతోందన్న అపోహలు ఎవరైనా తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. అభ్యర్థుల ప్రతినిధుల ప్రమేయం ఎలా ఉంటుంది..ట్యాంపరింగ్‌ని ఎలా నివారించవచ్చు సమగ్రంగా వివరించాలని డిప్యుటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్‌ను ధర్మాసనం కోరింది.

వివిప్యాట్లకు, ఇవిఎంలకు మధ్య లెక్కల్లో తేడా వస్తే పరిస్థితి ఏమిటని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. తాను ఓటు వేశానన్న నమ్మకాన్ని ఓటరులో కల్పించడానికి వివిప్యాట్ స్లిప్‌ను ఓటరుకు ఇస్తే ప్రమాదమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఆ అధికారి జవాబిస్తూ ఓట్ల గోప్యతపై ప్రభావం చూపుతుందని, ఉద్దేశపూర్వకంగా మోసం చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఇటీవల జరిగిన మాక్ పోల్ సందర్భంగా బిజెపి అభ్యర్థికి అదనంగా ఓట్లు వచ్చాయన్న ఆరోపణల గురించి తెలుసుకుని తమకు వివరణ ఇవ్వాలని ఇసి తరఫు న్యాయవాది మనీందర్ సింగ్‌ను కోర్టు ఆదేశించింది.

కాగా..మాక్ పోల్ సందర్భంగా బిజెపి అభ్యర్థికి సంబంధించి ఇవిఎంలు, వివిప్యాట్లలో ఒక ఓటు అదనంగా వచ్చినట్లు వెలువడిన వార్తలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ఈ వార్తలను క్రాస్ చెక్ చేయాలని ధర్మాసనం ఇసి తరఫు న్యాయవాదిని కోరింది. భోజన విరామం అనంతరం ధర్మాసనం తిరిగి వచిరారణ చేపట్టగా ఆ వార్తలను పరిశీలించిన తర్వాత అందులో నిజం లేదని తేలిందని ఇసి అధికారి తెలిపారు. ఆయన వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం మీరు చెబుతున్న దానికి, బయట లభిస్తున్న సమాచారానికి పొంతన కుదరడం లేదని స్పష్టం చేసింది. ఓటర్ల నమ్మకాన్ని, ఎన్నికల కమిషన్ యంత్రాంగ సమగ్రతను కాపాదేందుకు అపోహలను తొలగించాల్సిన అవసరం మాత్రం ఉందని పేర్కొంది.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ అధికారి ఇవిఎంల ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియను కోర్టుకు వివరించారు. కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్, వివిప్యాట్ల గురించి ఆయన వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పటికప్పుడు ఎంపిక చేసిన వివిఎంలకు చెందిన ఐదు వివిప్యాట్ పేపర్ స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉండగా దీన్ని 100 శాతానికి పెంచాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఫిబ్రవరి 19న శుక్రవారం ప్రారంభం కానున్నది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 లోక్‌సభ నియోజకవర్గాలలో తొలి దశలో పోలింగ్ జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News