Saturday, December 21, 2024

సుప్రీం దృఢ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

అదానీ ఉదంతంపై నెలకొల్పదలచిన ప్రత్యేక కమిటీలో నియామకానికి కేంద్రం సీల్డ్ కవర్‌లో పంపించిన పేర్లను తిరస్కరించడం ద్వారా సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన పాత్రను పోషించింది. స్టాక్ మార్కెట్ మదుపరుల ప్రయోజనాలను కాపాడడం కోసం పూర్తి స్థాయి పారదర్శకతను పాటించడమే తమ ధ్యేయమని, ప్రభుత్వ సూచనలను ఆమోదిస్తే అందుకు తీవ్ర విఘాతం కలిగి కమిటీ విశ్వసనీయతను కోల్పోతుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ వెలిబుచ్చిన అభిప్రాయం న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతకు రక్షా కవచం వంటిది. ప్రజలకు నిఖార్సయిన న్యాయం జరగాలంటే న్యాయమూర్తులు అణుమాత్రమైనా స్వప్రయోజన దృష్టి కలిగి వుండకూడదు. అయితే దురదృష్టవశాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలను గవర్నర్లుగా, రాజ్యసభ సభ్యులుగా నియమించే ధోరణి ఇటీవలి కాలంలో ప్రబలిపోయింది.

దీని వల్ల పలానా న్యాయమూర్తి పలానా కేసులో కేంద్ర పాలక పక్షానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందువల్లనే రిటైర్‌మెంట్ తర్వాత ఆయనను పలానా ఉన్నత పదవిలో నియమించారనే అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణలున్నాయి. అదానీ వ్యవహారంపై లోతైన పరిశీలన జరపడం ద్వారా స్టాక్ మార్కెట్‌లోని లొసుగులను గుర్తించి వాటిని తొలగించే దిశగా పని చేయడం కోసం ఏర్పాటు చేయదలచిన కమిటీలో నియామకానికి తగినవారంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సూచించదలచిన పేర్లను పరిశీలనకు తీసుకోడానికి కూడా సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో ఒక పిటిషనర్ తరపున వాదిస్తున్న ప్రశాంత్ భూషణ్ నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనం వంటి వారంటూ కొందరు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లను చెప్పదలచారు. ధర్మాసనం ఆయనను వారించి తాము ఎవరు సూచించిన పేర్లనూ స్వీకరించదలచుకోలేదని స్పష్టం చేసింది.

కేంద్రం పంపిన సీల్డు కవరును సుప్రీంకోర్టు తిప్పి కొట్టిన తర్వాత అదానీ గ్రూపు షేర్ విలువ 4.15 % (రూ. 77.60) పతనమైంది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ షేర్ మార్కెట్‌లో అదానీ తెర వెనుక బాగోతాన్ని బయటపెట్టిన అనంతరం ఆయన సంస్థల షేర్లు రూ. 10 లక్షల కోట్ల మేరకు నష్టపోయాయని సమాచారం. తమంతట తామే కమిటీని నియమిస్తామని, దాని వల్ల విశ్వసనీయత బలపడుతుందని ధర్మాసనం ప్రకటించింది. సెబి వంటి చట్టబద్ధ సంస్థలు మదుపరుల ప్రయోజనాలను కాపాడే సామర్థం వున్నవని, వాటి పని తీరును పరిశీలించడానికి కమిటీని నియమిస్తే అది తప్పుడు సంకేతాలను పంపించి దేశంలోకి డబ్బు రాకను దెబ్బ తీస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించడం ఎంత మోసపూరితమైనదో చెప్పనక్కర లేదు. నిజంగానే సెబికి అటువంటి సామర్థం, నిజాయితీ వుండి వుంటే అదానీ విదేశాల్లో డొల్ల కంపెనీలు నెలకొల్పి వాటి ద్వారా తన కంపెనీల షేర్లను కొనిపించి వాటి విలువను ఏ విధంగా కృత్రిమంగా పెంచగలిగాడు అనే ప్రశ్న తప్పనిసరిగా తలెత్తుతుంది.

అదానీ ఉదంతంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని నియమించాలని ప్రతిపక్షం పట్టుపట్టడంతో ప్రధాని మోడీ తీవ్ర ఇరకాటంలో చిక్కుకున్నారు. వాస్తవానికి ఆయన ఈ విషయమై పార్లమెంటులో ప్రకటన చేసి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అదానీతో ఆయనకు గల సాన్నిహిత్యం ప్రపంచానికంతటికీ తెలిసిందే. దేశంలోని రేవులను, ఎయిర్‌పోర్టులను, ఇతర పబ్లిక్ రంగ పరిశ్రమలను ప్రధాని మోడీ స్వయంగా కల్పించుకొని అదానీకి కేటాయింపజేశారనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ నాటుకొన్నది. అదానీ ప్రపంచంలో మూడవ అత్యంత ఐశ్వర్యవంతుడు కావడానికి ప్రభుత్వ పరంగానూ, వ్యక్తిగతంగనూ ప్రధాని ఆయనకు కల్పించిన అనేక వెసులుబాట్లే కారణమని రూఢిగా తెలుస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ పార్లమెంటు ముఖంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేసి వుండవలసింది. ఆయన సుదీర్ఘ మౌనం అనుమానాలకు తావు కల్పించింది.

ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్న దశలో సుప్రీంకోర్టు కమిటీని నియమిస్తామని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది. వాస్తవానికి గతంలో సంభవించిన కొన్ని కుంభకోణాలు మన షేర్ మార్కెట్‌లో మదుపరులు పెట్టే మదుపుకి రక్షణ లేదనే అభిప్రాయాన్ని కలిగించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించదలచుకొన్న కమిటీ దాని మూలాల్లోకి వెళ్ళి కృత్రిమంగా షేర్ల విలువను పెంచడమనే దుర్మార్గానికి శాశ్వతంగా చరమగీతం పాడడం ఎంతైనా అవసరం. అది జరగకుండా కేంద్రాన్ని, ప్రధానిని తాత్కాలికంగా గట్టెక్కించడం కోసమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నదనే అభిప్రాయానికి ఏమాత్రం అవకాశం కలిగినా అది మన న్యాయ వ్యవస్థకు చెప్పనలవికానంత ముప్పు తెస్తుంది. దాని విశ్వసనీయతను దెబ్బ తీస్తుంది. పారదర్శకతను కాపాడదలచామని సిజెఐ చేసిన ప్రకటన వాస్తవంలో నిరూపణ కావాలని కోరుకొందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News