హైదరాబాద్ : వైఎస్ వివేకాహత్యకేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సిబిఐ కోర్టును అభ్యర్థించింది. కౌంటర్ దాఖలు చేయడంతో పాటు లేటెస్ట్ ఛార్జిషీటు, కేసు ఒరిజినల్ ఫైల్‌ను సీల్డ్ కవర్‌లో పెట్టి అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సీరియస్ విషయమని, అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లు కలిపే వింటామని స్పష్టం చేసింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని గంగిరెడ్డి తరఫు లాయరు కోరగా అవినాష్ రెడ్డి బెయిల్ తోపాటు కలిపి వింటామని తేల్చి చెప్పింది. సెప్టెంబరు రెండోవారానికి కేసును వాయిదా వేసింది.
జూన్ 30వ తేదీన దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచించింది. రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని.. నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలని, జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దుచేయాలని కోరారు. సిబిఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తునకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలని సునీత సుప్రీంకోర్టును కోరగా ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన కేసులో కేసు డైరీ వివరాలను ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది.