ఇడబ్లూఎస్ కోటా చట్టంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
మూడు అంశాలను పరిశీలించాలని నిర్ణయం
ఈ నెల 13నుంచి విచారించనున్న రాజ్యాంగ ధర్మాసనం
ఐదు రోజుల్లో వాదనలు పూర్తి చేయాలని పిటిషనర్ల లాయర్లకు సూచన
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి తూట్లు పొడుస్తోందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మూడు కీలక అంశాలను పరిశీలించాలని గురువారం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈ వర్గాల వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలయిన పిటిషన్లను ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల కల్పనతో పాటు ఇతర ప్రత్యేక నిబంధనలు రూపొందించి అమలు చేసేందుకు రాష్ట్రాలను అనుమతించడం, అలాగే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతివ్వడం, చివరగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా పరిధినుంచి ఎస్‌ఇబిసిలు/ఎస్‌సిలు/ఎస్‌టిలను మినహాయించడం భారత రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనా? అనే మూడు ప్రశ్నలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
ఈ పిటిషన్లపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జెబి పర్దీవాలా సభ్యులుగా ఉన్నారు. ఈనెల 13నుంచి విచారణ ప్రారంభమవుతుందని ఈ ధర్మాసనం తెలిపింది. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఈ ప్రశ్నలను సుప్రీంకోర్టుకు నివేదించారు. కాగా ఇడబ్లుస్ కోటాలో క్రీమీ లేయర్ ప్రశ్నే ఉత్పన్నం కాదని బెంచ్ స్పష్టం చేసింది.పేదల్లో నిరుపేదలకు లబ్ధి చేకూర్చాలన్నదే దీని లక్షమని పేర్కొన్నారు. బెంచ్ తరఫున చీఫ్ జస్టిస్ యుయు లలిత్ మాట్లాడుతూ ఈ అంశంపై విచారణకు ఈ మూడు ప్రశ్నలు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. న్యాయవాదులు వీటిపై తమ వాదనలను వినిపించాలని కోరారు. ఐదు పనిదినాల్లో విచారణను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై మొత్తం 40 పిటిషన్లు దాఖలు కాగా, వాటిలో 2019లో జనహిత్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ప్రధానమైంది. ఈ కేసులో తమ లిఖిత పూర్వక వాదనలను సమర్పించాలని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న వలసవామధ్యప్రదేశ్, అసోం, మహారాష్ట్రలాంటి పలు రాష్ట్రాలను కూడా జస్టిస్ లలిత్ కోరారు. వాదనల్లో పునరుక్తి లేని పక్షంలో వారి వాదనలు కూడా వింటామని ఆయన తెలిపారు.
Supreme Court Key Decision on EWS quota