Sunday, December 22, 2024

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి హైకోర్టుకే బదిలీ చేస్తామని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశీయులకు1994 క్రయోజనిక్ కీలక పత్రాలను అప్పగించారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. క్రయోజనిక్ ఇంజిన్ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్‌పై ఈ ఆరోపణలు చేశారంటూ సిబిఐ కేసు నమోదు చేసింది.

నాటి పోలీసు అధికారులు గుజరాత్ మాజీ డిజిపి ఆర్.బి. శ్రీకుమార్, రిటైర్డ్ నిఘా అధికారి పి.ఎస్.జయ్‌ప్రకాశ్, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్. విజయన్, థంపి ఎస్ దుర్గా దత్‌పై కేసులు పెట్టింది. అయితే వారికి కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో హైకోర్టు తీర్పుపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నంబి నారాయణ్‌పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, రోదసి కార్యక్రమాలు ఒకటి నుంచి రెండు దశాబ్దాలపాటు వెనుకబడ్డాయని సిబిఐ వాదించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, విదేశీ కుట్రలో భాగస్థులయిన పోలీసులు ఇలా చేసి ఉండవచ్చని తెలిపింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సి.టి.రవి కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. “సిబిఐ అప్పీళ్లను అంగీకరిస్తున్నాం. నిందితులకు కేరళ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును కొట్టివేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తిరిగి కేరళ హైకోర్టుకే పంపిస్తున్నాం. నిందితుల బెయిల్ దరఖాస్తులను మళ్లీ మొదటి నుంచి విచారించండి. నాలుగు వారాల్లోగా దీనిపై తీర్పు వెలువరించండి” అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కాగా ముందస్తు బెయిల్ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువడేదాక నిందితులను ఆరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News