న్యాయవాద కుటుంబంలో విలువైన ఆభరణంగా అభివర్ణించిన సిజెఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ శుక్రవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టులో ఎనిమిదవ మహిళా జడ్జి అయిన ఆమెను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ న్యాయవాద కుటుంబంలో విలువైన అభరణంగా అభివర్ణించారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిజెఐ ప్రస్తావిస్తూ అది చర్రిత్రాత్మకమైనదన్నారు. జస్టిస్ బెనర్జీ కోర్టును ఎంతో హుందాగా, ఓపికగా, ప్రేమగా నిర్వహించే వారని లలిత్ ప్రశంసించారు. కాగా సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థ మరింత మంది మహిళా జడ్జిలను నియమిస్తుందన్న ఆశాభావాన్ని బెనర్జీ వ్యక్తం చేశారు. తాను ఎక్కువగా సాతంత్య్రాన్ని కోరుకుంటానని, అందువల్ల జడ్జి కావాలని తాను కోరుకోలేదని ఆమె అన్నారు. అయితే విధి విచిత్రమైనదని, 36 ఏళ్ల క్రితం ఒక కేసులో వాదించడం కోసం సుప్రీంకోర్టులో అడుగు పెట్టానని ఐఎఎస్ అధికారి కుమార్తె అయిన ఇందిరా బెనర్జీ అన్నారు.
తన దగ్గర సమయం ఉన్నప్పుడు డబ్బు లేదని, డబ్బు ఉన్నప్పుడు సమయం లేదని, అయితే ఇప్పుడు ఆ రెండూ తన వద్ద ఉన్నాయని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తానని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె అన్నారు. అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నాలుగేళ్లు పని చేసిన ఇందిరా బెనర్జీ అంతకు ముందు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.