Wednesday, January 22, 2025

మీడియాలో ప్రజాస్వామ్యం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు కారణంగా చెప్పడాన్ని సమర్థించలేమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మీడియా వన్ ఛానల్ ప్రసార లైసెన్స్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది.

హోం మంత్రిత్వ శాఖ వాదనలను సమర్థించిన కేరళ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రజల హక్కులను కాలరాస్తూ జాతీయ భద్రతను రక్షించలేమని వారన్నారు. జాతీయ భద్రతకు, ప్రభుత్వంపై విమర్శలకు మధ్య సుప్రీంకోర్టు ధర్మాసనం గీసిన బలమైన రేఖ బహుశా ఈ తీర్పులో అత్యంత ముఖ్యమైన అంశం. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఒక స్వతంత్ర పత్రికా రంగం అవసరమని, పత్రికలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి కలిగి వుండటాన్ని అనుమతించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. మీడియా వన్ లైసెన్స్ రెన్యూవల్‌కు నిరాకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 5న రద్దు చేసింది.

ప్రభుత్వం, మీడియా, న్యాయ వ్యవస్థ, ప్రజలు గౌరవించాల్సిన, పాటించాల్సిన ప్రజాస్వామిక విశ్వసనీయతకు సంబంధించి మీడియా స్వతంత్రతపై చర్చించాలని ఈ తీర్పు కోరుతోంది. మీడియాను ప్రజాస్వామ్యం యొక్క నాలుగో స్తంభం (ఫోర్త్ ఎస్టేట్) అని పిలుస్తారు. ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలియజేయడం దీని పని. ఆ విధానాల బాగోగులు చర్చించటం దాని వీధి. శాసన సభ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మిగిలిన మూడు వ్యవస్థలు. మీడియా వన్ ఛానల్ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం తన విశ్వసనీయతను ప్రదర్శించినప్పటికీ, న్యాయ వ్యవస్థ పాత్ర గురించి స్పష్టంగా చెప్పలేము. కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టుల వైఖరికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించలేం. మీడియా వన్ తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోకపోయి ఉంటే జాతీయ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా దాని స్వేచ్ఛ, స్వతంత్రత అణచివేతకు గురయ్యేవి.
భారత ప్రజాస్వామ్యం అనేక ఒత్తిళ్లకు లోనవుతోందన్న కఠోర వాస్తవాన్ని విస్మరించలేం.

ఈ తీర్పులో మీడియా స్వతంత్రత, ప్రభుత్వ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినందున, ఈ కోణంపై చర్చించడం సముచితంగా ఉంటుంది. మరే ఇతర దేశాల్లో కంటే భారత్‌లోనే ఎక్కువ మీడియా సంస్థలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో విస్తరించిన అనేక ఛానళ్లు, వార్తా పత్రికలతో పాటు, ప్రతి రాష్ట్రంలో స్థానిక భాషలలోను ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఔట్లెట్లతో పాటు ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు ప్రాంతీయ భాషల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్, మొబైల్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. సోషల్ మీడి యా దేశ వ్యాప్తంగా దాని స్వంత పాత్ర పోషిస్తున్నది. దీనికితోడు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు, మత సంఘాలు, ఇతర సంస్థలు, అవి నిర్వహించే సామాజిక మాధ్యమాల లింకులతో పాటు వివిధ మీడియా సంస్థలపై ఉన్న పట్టును విస్మరించలేం. చిన్న చిన్న సమావేశాలపై కూడా చురుకుగా చర్చలు జరిపే అలవాటు ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా ఉంది. సమకాలీన సమస్యలపై సమాచార వ్యాప్తి – మీడియా, అక్షరాస్యతలకు అతీతంగా విస్తరించి ఉందని చెప్పడానికి సందేహించ నక్కరలేదు.

మీడియా శక్తి కూడా, దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందనే విషయాన్ని కాదనలేము. ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ముందస్తు ఉద్దేశంతో రాజకీయ నాయకులు, ఇతరులు మీడియా కవరేజీని పొందడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. పతాక శీర్షికలను ఆకర్షించే వ్యూహాలలో వారు నిమగ్నం కావడాన్ని గమనించవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ లా కనిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం, పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడగటం, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, వివిధ రాజకీయ నాయకుల చీపురు కట్టేల వాడకం వంటి విన్యాసాలు ఆయా రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఉన్నాయి. ఈ వ్యూహాలు ఎన్నికలలో విజయం సాధిస్తాయా అనేది పక్కన పెట్టినా, రాజకీయ నాయకులు గణనీయమైన మీడియా కవరేజీని పొందడానికి ఇవి సహాయపడుతున్నాయి. మీడియా సంస్థలు ఖచ్చితంగా రాజకీయ నాయకుల పబ్లిసిటీని పెంచుతున్నాయి. ప్రజలు ఆ నాయకుల గురించి మరింత తెలుసుకోవడానికి దోహదపడుతున్నాయి. అయితే ఇవి ప్రజల ఓట్లపై ఆశించిన ప్రభావం చూపుతాయన్న గ్యారంటీ లేదు.

ఓటర్లను ప్రభావితం చేయడంలో భాగంగా ఠాగూర్‌లా కనిపించడానికి మోడీ చేసిన ప్రయత్నం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి (బిజెపి) అనుకూలంగా మారలేదు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉపయోగించిన చీపురు కట్ట ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. రాహుల్ గాంధీ యాత్ర తన గురించి ప్రతికూల ఇమేజ్ ను చిత్రీకరించడానికి ప్రత్యర్థుల ఎత్తుగడలను ఖచ్చితంగా దెబ్బతీసింది, అయితే ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా అవకాశాలను వృద్ధి చేసిందా అనేది చెప్పలేము. ఈ నేపథ్యంలో, వివిధ సంస్థలు తమ స్పాన్సర్ల, యజమానులు వ్యాపార ప్రయోజనాల కోసం, ఇలాంటి ఇతర కారకాల కోసం వారి ప్రత్యర్థుల కంటే ముందు ఉండటానికి సహాయపడటం సముచితమని భావిస్తున్నారు. ప్రజాస్వామిక నైతికత ప్రకారం అది ఎంతవరకు సముచితం? వాటిని కమ్యూనికేట్ చేసే అధికారం మీడియాకు ఖచ్చితంగా ఉంది.

భారత దేశంలో ఎన్నికల సీజన్‌లో మీడియా కవరేజీని పొందడానికి, తద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని నిర్దిష్ట అంశాలను ఊపయోగిస్తున్నట్లు అనుకోవచ్చు. అల్లర్లు లేదా అతివాద మత కార్డుల మితిమీరిన వాడకం, ‘లౌకిక’ కార్డులు, ప్రత్యర్థుల ‘విజయాలు’ లేదా వైఫల్యాలు, పాకిస్తాన్ వ్యతిరేక కార్డు, కశ్మీర్ -రాజకీయాలు, కుల కారకం, మహిళల ‘సంక్షేమం’, గ్రామీణ భారతదేశం, పేద వర్గాల సంక్షేమం లాంటి సమస్యలతో ముడిపడి ఉన్న‘వార్తలు’ వీటి లో ఉన్నాయి.
ఈ వర్గాల ‘వార్తలను’ మీడియా విస్మరించజాలదని స్పష్టమవుతోంది. ఇది మీడియా కవరేజీని పొందడానికి, ‘న్యూస్ మేకర్స్’ ఎజెండా గురించి ప్రజలను ‘ఒప్పించడానికి’, దానిని ‘సమర్థించడానికి’ మీడియా శక్తిని ఉపయోగిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీడియా శక్తిని ప్రత్యేకంగా ‘వార్తా నిర్మాతలు’ తమ లక్ష్యంగా భావించే దాని కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా, తరచుగా మీడియా శక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది- ‘వార్తా నిర్మాతలకు’ గణనీయమైన కవరేజీని ఇవ్వడం తప్ప చాలా సార్లు, వివిధ మీడియా సంస్థలకు వేరే మార్గం లేదు. ఈ రేసులో ప్రత్యర్థుల కంటే వెనుకడుగు వేయలేరు.

అంతేకాకుండా, మీడియా అధికారాన్ని ఉపయోగించే విధానాన్ని నిర్ణయించడంలో వాణిజ్య ప్రయోజనాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరిన్ని ప్రకటనలు పొందాలనే ఆకర్షణ, వివిధ సమస్యలకు అనుగుణంగా వారి ‘కమాండ్’ ఉపయోగించడంలో వారి వ్యాపార వ్యూహం మార్గనిర్దేశం చేస్తుంది. మీడియా అధికారాన్ని వివిధ స్థాయిలలో ఉపయోగించే ఈ విధానానికి సంభావ్య కారణాలను, విమర్శకులు గమనించవచ్చు లేదా గమనించకపోవచ్చు. ప్రజాస్వామికంగా చెప్పాలంటే మీడియా ప్రజల దృష్టిని ఏ మేరకు ఆకర్షించగలదు?కనీసంగా వారు ‘వార్తల’ పట్ల ఆసక్తి చూపవచ్చు, దాని గురించి మరింత తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. దాని గురించి తమ అభిప్రాయాన్ని ఆధారం చేసుకునే దృక్పథం నుంచి దూకుడు ప్రవర్తనను ప్రదర్శించే స్థాయికి, మత కలహాల స్థాయికి కూడా వారు ప్రభావితమయ్యేలా ప్రేరేపించవచ్చు. నిష్పాక్షికంగా చెప్పాలంటే, ఈ రెండు పారామీటర్లను వారు ఓటు వేయడానికి ఎంచుకుంటారా అలా వారు ఓటు వేస్తారా లేదా అనేది చెప్పలేము. ప్రజల ఓటు నిర్ణయం వారిపై పెద్దగా ప్రభావం చూపని ‘అంశాల వార్తల’ ద్వారా ఎంతవరకు ప్రభావితమవుతుంది.? పరిశీలించాలి.

భారత దేశం అనేక రాజకీయ పార్టీలకు నిలయం. ఈ జనాభా ఆర్థిక, మత, కుల, భాషీయ, ప్రాంతీయ, ప్రాతిపదికలపై అనేక గ్రూపులుగా సామాజికంగా విభజించబడినందున, ఒక పార్టీ లేదా ఒక నాయకుడు జాతీయ, స్థానిక స్థాయిలో అన్ని వర్గాలకు జనాకర్షణను కలిగి ఉండటం ఆచరణాత్మకంగా అసాధ్యంగా భావించవచ్చు.తనను తాను గొప్ప నాయకుడిగా చెప్పుకోవడానికి మీడియా హైప్ క్రియేట్ చేయడంలో ఒకరు విజయం సాధించవచ్చు, దీనికి మోడీ ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ సహచరులు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వంటి ఇతర పార్టీ నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ‘ప్రజాస్వామిక’ విజయాన్ని మీడియా హైప్ ద్వారా అంచనా వేయలేము. ప్రజల ఎన్నికల పటిమపైనే నిజమైన ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది.

వాస్తవానికి, వారి స్వేచ్ఛను ప్రశ్నించే ప్రమాదం ఉన్నప్పటికీ, ఒత్తిడికి గురికాకుండా స్వతంత్ర స్వరాన్ని వినిపించడం ఎంచుకున్న మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ బూమ్ వల్ల ఇవి చురుకైన పాత్ర పోషించడానికి, జాతీయ- అంతర్జాతీయ సమస్యలతో సహా సమస్యల విశ్లేషకులుగా, విమర్శకులుగా పని చేయడానికి దోహదం చేసింది. ఈ కోణం నుంచి చూస్తే ఇటీవలి న్యాయ తీర్పు వారి స్వేచ్ఛకు, ప్రజాస్వామిక హక్కులకు రక్షణగావుండే అవకాశం ఉంది. అయితే అన్ని మీడియా సంస్థలకు ప్రజాస్వామ్యయుతంగా వాటిని వినియోగించుకునే స్వేచ్ఛ, హక్కులు కనిపించడం లేదు. భారత ప్రజాస్వామ్యాన్ని అనేక స్థాయిల్లో పరీక్షిస్తున్న ప్రస్తుత దశలో మీడియా ప్రజాస్వామిక హక్కులపై తీర్పు ఇచ్చినందుకు సిజె చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానానికి అభినందనలు చెప్పకుండా ఉండలేం. కనీసం కొన్ని స్థాయిలలో, మీడియా కొంత విశ్వసనీయతను నిలుపు కోగలుగుతుంది. దాని ప్రజాస్వామిక బలం ఇప్పటికీ చాలా సజీవంగా, చురుకుగా పరిగణించబడుతుంది!

(రచయిత నీలోఫర్ సుహ్రావర్ది. కమ్యూనికేషన్ స్టడీస్, న్యూక్లియర్ డిప్లొమాసీలో స్పెషలైజేషన్ ఉన్న సీనియర్ జర్నలిస్ట్, ఆమె అనేక పుస్తకాలను వెలువరించారు. అవి:- మోడీ విజయం, కాంగ్రెస్‌కు గుణపాఠం…? (2019); అరబ్ స్ప్రింగ్, కేవలం ఎండమావి కాదు! (2019), ఇమేజ్ అండ్ సబ్‌స్టాన్స్ మోడీ మొదటి ఏడాది (2015), మతతత్వ ముద్ర లేని అయోధ్య, ఇండియన్ సెక్యులరిజం పేరుతో (2006)).

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News