న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రభుత్వం ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళ వారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా దీనిపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. జాతీయ భద్రతపై ఏ ఒక్కరూ రాజీ పడాలని కోరుకోరని, కొందరు ప్రముఖ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, అయితే సంబంధిత యంత్రాంగం అనుమతి తోనే ఇలా చేయాల్సి ఉంటుందని, ఆ అథారిటీ కోర్టు ఎదుట అఫిడవిట్ దాఖలు చేయడానికి సమస్య ఏముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం లోని సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పెగాసస్ వ్యవహారంలో కోర్టు ముందు దాపరికంతో వ్యవహరించాలని కేంద్రం కోరుకోవడం లేదని, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారమని, ఈ సాఫ్ట్‌వేర్‌ను అన్ని దేశాలు కొనుగోలు చేశాయని, ఈ సాఫ్ట్‌వేర్‌ను తాము వాడుతుంటే ఆ వివరాలు వెల్లడించాలని పిటిషనర్లు కోరుతున్నారని, తాము అలా చేస్తే ఉగ్రవాదులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని ఆందోళన వెలిబుచ్చారు. నిపుణుల కమిటీ ఈ అంశాలను పరిశీలిస్తోందని, వీటిపై బహిరంగంగా చర్చించలేమని, తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. నిపుణుల కమిటీ ఈ నివేదికను కోర్టుకు అందచేస్తుందని, కానీ ఈ అంశాలను తాము ఎలా సంచలనం చేయగలమని ఆయన వాదించారు.