కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: అంగ వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి ఇంటి వద్దకే కొవిడ్ వ్యాక్సిన్ అందచేయడంపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఈ మేరకు నోటీసులు జారీచేస్తూ దివ్యాంగులకు సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను, ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలను తమకు అందచేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. ఎవర ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది పంకజ్ సిన్హా ఈ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింతగా విస్తరించడానికి ఇంటింటికి వ్యాక్సినేషన్ చేపట్టాలని భారతీయ వైద్య సంఘం చేసిన సూచనను పంకజ్ సిన్హా కోర్టు దృషికి తెచ్చారు. ఈ చర్యలను జార్ఖండ్, కేరళ విజయవంతంగా నిర్వహిస్తున్నాయని, దివ్యాంగులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.