Tuesday, January 7, 2025

పోలవరంపై వివరణలు ఇవ్వండి: ఎపి, తెలంగాణ, ఒడిషాకు సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసులు పంపించింది. సంబంధిత అనుమతులలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ, అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. కేంద్రం, సంబంధిత ఇతర పక్షాలు తమ సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించారు. కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషాలకు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుంద్రేష్ ధర్మాసనం వివరణకు ఆదేశించింది. ఫిబ్రవరిలో కేంద్రం, ఎపి, తెలంగాణ రాష్ట్రాలు తమ వివరణలు పొందుపర్చాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను ఆర్థికవిశ్లేషకులు పెంటపాటి పుల్లారావు తమ న్యాయవాది శ్రవన్ కుమార్ ద్వారా సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు విచారణకు దిగింది. పర్యావరణ అనుమతులను వెలువరించిన ఎన్‌జిటి ఆదేశాలను పిటిషనర్ సవాలు చేశారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖల సంయుక్త సంఘం నివేదికలను పరిశీలించకుండానే జాతీయ హరిత సాధికారిక సంస్థ అనుమతులు జారీ చేసిందని తెలిపారు. ప్రాజెక్టు స్థలంలో పెద్ద ఎత్తున జరిగే పనులతో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందని, సమీపంలోని వ్యవసాయ భూములలో ఇప్పటికే భారీ స్థాయిల్లో ప్రాజెక్టు నిర్మాణాల సామాగ్రి ఒక్కటే కాకుండా చెత్తాచెదారం తెచ్చివేస్తున్నారని పిటిషనర్ తమ అర్జీలో తెలిపారు. ఒక్కరోజు క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ.10,485 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించారు. గోదావరి నదిపై నిర్మించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులు రూ 2937 కోట్లు వరకూ క్లియర్ చేయాలని కూడా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News