హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ముద్ర పడాల్సి ఉంటుంది.
అలా జరిగితేనే.. వాటి అమలుకు వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే పది బిల్లులను పంపితే.. తిరస్కరించడమో లేదంటే సూచనలు చేయడమో లేదంటే వెనక్కి తిప్పి పంపడం చేయకుండా గవర్నర్ బిల్లులను పెండింగ్‌లో ఉంచారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌లో గవర్నర్‌తో పాటు గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. అయితే.. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాకపోతే.. ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతూ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కలుగుజేసుకుని తెలంగాణ గవర్నర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బదులిస్తానంటూ ధర్మాసనాన్ని కోరారు. అయినప్పటికీ సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.