న్యూఢిల్లీ : విడాకులు కోరుతూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన భార్యకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఆమె సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తులు సుధాన్షుదులియా, అసనుద్దీన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పాయల్ అబ్దుల్లా తన పట్ల క్రూరత్వంతో వ్యవహరిస్తున్నందున తనకు విడాకులు మంజూరు చేయాలంటూ 2016లో ఒమర్ అబ్దుల్లా వేసిన పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తోసి పుచ్చింది. ఒమర్ విజ్ఞప్తిలో ఎలాంటి అర్హత లేదని పేర్కొంది.
దీనిని ఒమర్ అబ్దుల్లా హైకోర్టులో సవాలు చేశారు. అయితే కుటుంబ న్యాయస్థానం వెలువరించిన ఆదేశాన్ని న్యాయమూర్తులు సంజీవ్‌సచ్‌దేవ్, వికాస్ మహాజన్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం కూడా 2023లో సమర్ధించింది. తన వాదనను బలపరిచేందుకు తగిన సాక్షాలను ఆయన చూపించలేకపోయారని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను తిరిగి సుప్రీం కోర్టులో ఒమర్ సవాలు చేశారు. ఒమర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన వినిపిస్తూ గత 15 ఏళ్లుగా వారు విడివిడిగానే ఉంటున్నారని, వారి దాంపత్యం దాదాపు ముగిసినట్టేనని అన్నారు.
వీరి విషయంలో ఆర్టికల్ 142ను పరిగణన లోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఒమర్, పాయల్ అబ్దుల్లా 1994 సెప్టెంబర్ 1న వివాహం చేసుకున్నారు. 2009 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా, ఒమర్ సంరక్షణలో ఒకరు, పాయల్ సంరక్షణలో మరొకరు ఉంటున్నారు. ఇంతకు ముందు హైకోర్టు కూడా ఒమర్‌ను తన ఇద్దరు కొడుకుల సంరక్షణకు నెలసరి రూ.60,000 వంతున ఇవ్వాలని, అలాగే పాయల్‌కు నెలసరి మెయింటెనెన్స్‌గా రూ.1.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. చక్కదిద్దలేనంతగా విఫలమైన వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేషాధికారం ఉన్నట్టు గతంలో సుప్రీం వెల్లడించిన సంగతి తెలిసిందే.