Wednesday, January 22, 2025

హైకోర్టు జడ్జి మీడియా ఇంటర్వ్యూ పై సుప్రీం అభ్యంతరం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఒక టివి చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి న్యాయమూర్తులు మీడియా ఇంటర్వ్యూలో ఇవ్వరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. తమ ఎదుట పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి టివి ఇంటర్వ్యూలలో మాట్లాడే అవసరం న్యాయమూర్తులకు లేదని సిజెఐ అన్నారు. మీడియాలో వచ్చే ప్రతి వార్తకు వివరణ ఇవ్వాల్సిన అవసరం న్యాయమూర్తులకు లేదని కూడా ఆయన చెప్పారు.

జస్టిస్ గంగోపాధ్యాయ ఒక టివి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ఈ అంశాన్ని సిజెఐ ప్రస్తావిస్తూ అదే నిజమైతే ఆ కేసును ఆయన(జస్టిస్ గంగోపాధ్యాయ) ఇక విచారించలేరని చెప్పారు. దర్యాప్తు అంశం తమ పరిధిలోకి రానప్పటికీ ఒక టివి డిబేట్‌లో పిటిషనర్‌పై తన అభిప్రాయాన్ని న్యాయమూర్తి ఇచ్చిన పక్షంలో ఆ కేసును ఇక ఆయన వినలేరని సిజెఐ తెలిపారు. ఒక కొత్త ధర్మాసనాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఓ రాజకీయ ప్రముఖుడికి సంబంధించిన కేసు గురించి హైకోర్టు న్యాయమూర్తి టివిలలో మాట్లాడడం సబబు కాదని సిజెఐ అన్నారు.

ఎబిపి ఆనందకు చెందిన సుమన్ డేకు జస్టిస్ గంగోపాధ్యాయ ఇంటర్వూ ఇచ్చారా లేదా అన్నది నిర్ధారించాలని కోల్‌కతా హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌ను సిజెఐ ఆదేశించారు. తమ ఎదుట అఫిడవిట్ సమర్పించాలని కలకత్తా హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌ను సిజెఐ ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామక కుంభకోణంలో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీని ప్రశ్నించాలని ఇడి, సిబిఐని ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగోపాధ్యాయ ఇంటర్యూకు సంబంధించిన అనువాద ప్రతిని పిటిషనర్ తరఫు న్యాయవాది సిజెఐకి సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News