Wednesday, January 22, 2025

26 వారాల గర్భంపై మీమాంస

- Advertisement -
- Advertisement -

26 వారాల గర్భాన్ని వదిలించుకోడానికి అనుమతి కోరుతూ వచ్చిన ఒక కేసులో సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును వెనువెంటనే వెనక్కి తీసుకోడం విశేషం. ఈ కేసులో తల్లికి తన శరీరం మీద, ప్రాణం మీద గల హక్కులా , పుట్టబోయే బిడ్డ హక్కులా ఏవి ముఖ్యమైనవి అనే మీమాంస తలెత్తింది. వైద్యపర గర్భ విచ్ఛిత్తి చట్టం ప్రకారం ఒక మహిళ తన గర్భాన్ని విడనాడుకోడానికి ఆ గర్భం ధరించిన 24 వారాల వరకు అనుమతిస్తారు. కాని ప్రస్తుత కేసులో 26 వారాల వరకు కొనసాగిన తన గర్భాన్ని విచ్ఛిత్తి (అబార్షన్) చేసుకోడానికి అనుమతించాలని ఒక మహిళ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహిళా న్యాయమూర్తులు బివి నాగరత్నమ్మ, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం సోమవారం నాడు గర్భ స్రావానికి అనుమతి ఇచ్చిన తర్వాత వైద్యుల నుంచి, కేంద్రం నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

గర్భస్థ శిశువు పెరిగి ప్రాణం పోసుకొంటున్నదని, గుండె కొట్టుకోడం కూడా మొదలైందని ఢిల్లీ ఆలిండియా వైద్యశాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) వైద్యుల బోర్డు అభిప్రాయపడింది. దీనితో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన అబార్షన్ తీర్పును వెనుకకు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వవలసిందిగా కేంద్రం ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి ప్రధాన న్యాయమూర్తిని అర్థించారు. అబార్షన్‌కు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును వెనుకకు తీసుకోవలసిందిగా అదే ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు పెట్టుకోవలసిందని ఐశ్వర్యభాటిని మంగళవారం నాడు సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఈ దశలో గర్భస్రావం జరపవలసిందేనని జస్టిస్ నాగరత్నమ్మ, అందుకు తన మనసు అంగీకరించడం లేదని జస్టిస్ హిమా కోహ్లి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను ప్రకటించారు.

దానితో ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. పుట్టబోయే శిశువు హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఈ ధర్మాసనం కేసు విచారణ సందర్భంలో అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు ప్రసవం జరిగితే పని చేస్తున్న గుండెతో పిండం బయటపడే అవకాశమున్నదని వైద్యుల్లో ఒకరు చెప్పినందున అబార్షన్ డిమాండ్‌ను ఉపసంహరించుకోవలసిందిగా తల్లికి ధర్మాసనం హితవు చెప్పింది.ప్రాణమున్న పిండాన్ని తొలగించవలసిందిగా ఎవరు చెబుతారని అన్నది. రాజ్యాంగం 21వ అధికరణ కింద తల్లికి గల స్వయం నిర్ణయాధికారాన్ని తిరస్కరించలేమని, అదే సమయంలో పుట్టబోయే శిశువు హక్కులను పరిగణనలోకి తీసుకోవలసి వున్నదని భావించింది. గర్భవతిని అనే విషయం ఆమెకు తెలియదని, ఆమె మానసిక అస్థిమితత్వంలో వున్నారని, ఇప్పటికే నాలుగేళ్ళ మొదటి సంతానం, ఏడాది వయసులోని రెండో సంతానం కలిగి వున్న ఆమె ఇప్పట్లో మరో బిడ్డను కని పెంచే స్థితిలో లేరని తల్లి తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.

అలాగే ప్రసవించగల శరీర దారుఢ్యం కూడా ఆమెకు లేదని, ప్రసవానంతర ఆరోగ్య సమస్యలు ఎదురైతే తట్టుకొనే స్థితిలో కూడా ఆమె లేరని న్యాయవాది వెల్లడించారు. ఆ తల్లి చివరి వరకు గర్భాన్ని భరించి బిడ్డను కని తీరాల్సిందేనని ఎయిమ్స్ వైద్యుల్లో ఒకరు, కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడడంతో సుప్రీంకోర్టు పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది. కాని మహిళకు తన మీద గల తిరుగులేని హక్కును కాపాడాలనే అభిప్రాయంతోనే ఈ కేసును మొదటి ధర్మాసనం విచారించినట్టు స్పష్టపడుతున్నది. పుట్టబోయే బిడ్డ హక్కు కంటే తల్లి హక్కులే ముఖ్యమైనవని, వాటి రక్షణ తమ బాధ్యత అని ద్విసభ్య ధర్మాసనం గట్టిగా చెప్పింది. బిడ్డ పుట్టిన తర్వాత దత్తతకు ఇతరులకు ఇవ్వవచ్చుననే సలహాను కూడా ఆ మహిళ, ఆమె భర్త త్రోసిపుచ్చారు.

తప్పనిసరిగా కన వలసి వస్తే బిడ్డను తామే భరిస్తామని దత్తతకు ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. అదే సందర్భంలో బిడ్డ అంగ వైకల్యంతోగాని, అనారోగ్యంతో గాని పుట్టినట్టయితే భరించేశక్తి తమకులేదని కూడా భర్త తెలియజేశారు. ఇంతటి క్లిష్టమైన నేపథ్యంలో అంతిమంగా ఏమి జరుగుతుందనేది ఉత్కంఠభరితమే. ఈ కేసుపరంగా కొన్ని కీలకాంశాలు ముందుకు వచ్చాయి. ఆర్థికంగా అణగారిన ఈ దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలియవని తెలుస్తున్నది.వివాహిత దంపతులు కుటుంబ సంక్షేమ పథకాలన్నింటి గురించి తెలుసుకొని వుండాలని, కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని అవగాహన పరచుకొని తగిన ముందస్తు జాగ్రత్తలతో ప్రణాళికాబద్ధంగా గర్భాన్ని అనుమతించాలని ద్విసభ్య ధర్మాసనం చేసిన సూచన అందరూ పాటించదగినది.అయితే పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేమి అపరిమితంగా వున్న మన వంటి దేశంలో మారుమూల నిరుపేద దంపతులకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ విషయాలను తెలియజేసి అవాంఛిత గర్భాలు వారాలు మించిపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే వున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News