Sunday, December 22, 2024

ఎఎంయు మైనారిటీ హోదా తేల్చే బాధ్యత కొత్త బెంచ్‌కు

- Advertisement -
- Advertisement -

అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) మైనారిటీ హోదాపై వివాదాస్పద చట్టబద్ధ అంశాన్ని కొత్త ధర్మాసనం తేలుస్తుందని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఎఎంయును కేంద్ర చట్టం ద్వారా సృష్టించినందున దానిని మైనారిటీ సంస్థగా పరిగణించజాలరన్న 1967 నాటి తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై 4:3 మెజారిటీ తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల ఏర్పాటులో లేదా పాలనలో మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలపై వివక్ష చూపిన శాసనం లేదా కార్యనిర్వాహక వర్గ చర్య రాజ్యాంగం 30(1)వ అధికరణం కింద చెల్లనేరదు అని బెంచ్ తీర్పు ఇచ్చింది. 30వ అధికరణం విద్యా సంస్థల ఏర్పాటుకు. పాలన నిర్వహణకు మైనారిటీల హక్కుకు సంబంధించినది.

మత పరంగా లేదా భాష పరంగా మైనారిటీలు అందరికీ తమ ఇష్టానుసారం విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, నిర్వహించుకునే హక్కు ఉంటుందని 30(1)వ అధికరణం నిర్దేశిస్తున్నది. ‘చట్టం ద్వారా న్యాయబద్ధ ప్రతిపత్తి పొందినట్లయితే ఒక విద్యా సంస్థను ఒక మైనారిటీ ఏర్పాటు చేయలేదని అజీజ్ భాషా (1967 తీర్పు)లో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తోసిపుచ్చడమైంది’ అని 118 పేజీల తీర్పు రాసిన సిజెఐ స్పష్టం చేశారు. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జెబి పార్దీవాలా, మనోజ్ మిశ్రా తరఫున కూడా ఆయన తీర్పు రాశారు. ఎఎంయు ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అని, దానిని మైనారిటీ సంస్థగా పరిగణించజాలరని 1967లో అజీజ్ బాషా వెర్సస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ‘అదనంగా, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసిన భాషాపరమైన లేదా మతపరమైన మైనారిటీ సంస్థ నిర్వహణలో మరింత స్వయంప్రతిపత్తి గ్యారంటీ పొందుతున్నారు.

ఇది ఆ నిబంధనలోని ‘ప్రత్యేక హక్కులు’కు సంబంధించింది’ అని మెజారిటీ తీర్పు పేర్కొన్నది. 30(1) అధికరణం ప్రయోజనం నిమిత్తం మైనారిటీ విద్యా సంస్థగా ఉండేందుకు తమ సమాజం కోసం విద్యా సంస్థను ఏర్పాటు చేశామని మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలు నిరూపించాలని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘30(1) అధికరణం గ్యారంటీ ఇస్తున్న హక్కు రాజ్యాంగం ప్రారంభానికి ముందు ఏర్పాటైన విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News