న్యూఢిల్లీ : కనుసైగలు , డ్యూయెట్లు , ప్రేమలు పెళ్లిళ్లు చివరికి విడాకులకే దారితీస్తున్నాయా? అవుననే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలొ ఎక్కువగా విడాకుల కేసులు ప్రేమవివాహాలు చేసుకున్న వారి నుంచే దాఖలు అవుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం పేర్కొంది. తమ ముందుకు వచ్చిన ఓ జంట విడాకుల కేసువిచారణ దశలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం ప్రేమ పెళ్లిళ్లు ఈ విధంగా విడిపోవడానికి ఎందుకు దారితీస్తున్నాయని ధర్మసందేహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి తాను క్రిస్టియన్ మతం స్వీకరించాలని అనుకుంటున్నానని అయితే దీనిపై వైవాహిక తగవు ఏర్పడిందని పేర్కొంటు ట్రాన్స్‌ఫర్ పిటిషన్ వేశారు.
దీనిని పరిశీలించిన ధర్మాసనం ఈ కేసులో కూడా జంటది ప్రేమ వివాహమే అని తమకు తెలిసిందని , ఎక్కువ విడాకులు కేసులు ప్రేమ పెళ్లిళ్ల వారివే వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 1వ తేదీన ఈ కేసుకు సంబంధించి ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి సూచించింది. అయితే ఈ వ్యక్తి దీనికి సమ్మతించలేదు. దీనితో ఆయన సమ్మతి లేకుండానే విడాకులు మంజూరు చేస్తామని కోర్టు తెలిపింది. ఇటీవలే రాజ్యాంగ ధర్మాసనం విడాకుల మంజూరీ, తక్షణ చర్యకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లకు తెలిపింది. త న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల విడాకుల గురించి కీలక వ్యాఖ్యలతో రూలింగ్ వెలువరించింది.
ఇక కలిసి ఉండటం కుదరదనుకునే దశలో , విడిపోవడం తప్ప మరో దారిలేదని నిర్థారణకు వచ్చిన దశలో వివాహం రద్దు ఒక్కటే సవ్యమైన పరిష్కారం అవుతుందని తెలిపింది. పరస్పర సమ్మతి నమ్మకం కీలకం అయిన వివాహాల విషయంలో ఇవి బెడిసికొట్టినప్పుడు ఈ బంధానికి అర్థం లేదని పేర్కొంది. కుటుంబ న్యాయస్థానాల పరిధితో నిమిత్తం లేకుండా దంపతుల సమ్మతి ఉంటే ఆరు నెలల నిరీక్షణ కాలంతో సంబంధం లేకుండా వెంటనే విడాకులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తనకున్న విశేషాధికారాన్ని రాజ్యాంగంలోని 142(1) పరిధిలో వినియోగించుకోవచ్చునని తెలిపింది.