Tuesday, September 17, 2024

రైతుల నిరసనను రాజకీయం చేయరాదు:సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

రైతుల నిరసన అంశాన్ని రాజకీయం చేయరాదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. శంభు సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ అధ్యక్షతన ఒక ఉన్నతాధికార కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. కమిటీ తొలి సమావేశాన్ని ఒక వారంలోగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పంజాబ్, హర్యానా మధ్య ప్రయాణికుల రాకపోకలకు వెసులుబాటు కల్పించడానికై శంభు సరిహద్దు నుంచి తమ ట్రాక్టర్లు, ట్రాలీలు మొదలైనవాటిని వెంటనే తొలగించేలా ఆందోళనకారులైన రైతులకు నచ్చజెప్పేందుకు వారితో సంప్రదించవలసిందని కమిటీని బెంచ్ కోరింది. కమిటీకి సూచనలు చేసేందుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రెండింటికీ స్వేచ్ఛ ఉందని బెంచ్ తెలిపింది.

కమిటీలో సభ్యులుగా విశ్రాంత ఐపిఎస్ అధికారి పిఎస్ సంధు, దేవేందర్ శర్మ, ప్రొఫెసర్ రంజిత్ సింగ్ ఘూమన్, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ సుఖ్‌పాల్ సింగ్ కూడా ఉన్నారు. తమ పరిశీలన నిమిత్తం అంశాలను నిర్ణయించుకోవలసిందని ఉన్నతాధికార కమిటీని బెంచ్ కోరుతూ, అవసరమైనప్పుడు నిపుణుని అభిప్రాయం కోరడానికి ప్రత్యేక ఆహ్వానితునిగా చౌదరి చరణ్ సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్‌ను ఆహ్వానించాలని కూదా ఆదేశించింది. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని, ఆచరణసాధ్యం కాని డిమాండ్లపై పట్టుబట్టవద్దని కూడా నిరసనకారులైన రైతులను బెంచ్ హెచ్చరించింది. రైతుల సమస్యలను రాజకీయం చేయరాదని, వాటిని కమిటీ దశల వారీగా పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

తమ శాంతియుత ఆందోళనలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించే స్వేచ్ఛ రైతులకు ఉందని సుప్రీం కోర్టు తెలియజేసింది. ఆందోళనకారులైన రైతులు ఫిబ్రవరి 13 నుంచి మకాం వేసిన అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన అవరోధాలను ఒక వారంలోగా తొలగించాలన్న హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News