విడాకుల తర్వాత భర్త నుంచి భార్య పొందే భరణానికి సంబంధించిన నిబంధనలు భార్య సంక్షేమానికి ఉద్దేశించినవే తప్ప భర్తను భయపెట్టేందుకో, శిక్షించేందుకో లేక దోపిడీ చేసేందుకో ఉద్దేశించినవి కావంటూ సుప్రీం కోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎన్నదగినవి. భార్యా బాధితులకు ఊరటనిచ్చేవి కూడా. తన భర్త సంపదకు తగినట్లుగా తనకు భరణం ఇప్పించాలంటూ కేసు వేసిన ఓ గృహిణిని సర్వోన్నత న్యాయస్థానం మందలిస్తూ, ఒకవేళ విడాకులు తీసుకున్నాక భర్త ఆర్థిక పరిస్థితి దిగజారితే బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించడం సహేతుకమే. భర్త, అత్తింటివారినుంచి డబ్బు వసూలు చేయాలన్న లక్ష్యంతోనే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలతో కేసులు పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. మనోవర్తి అనేది రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కే కాదు, మానవ హక్కుల్లో అది ఒక భాగమని గతంలోనూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, నేర న్యాయస్మృతి వంటివి మనోవర్తికి సంబంధించిన అంశాలను వివరిస్తున్నాయి. ఈ చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకుని భర్తనుంచి ఎక్కువ డబ్బు గుంజాలనుకునే మహిళలకు తాజా తీర్పు చెంపపెట్టులాంటిదే. గృహహింస నిరోధక చట్టమూ ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. తమను రాచిరంపాన పెట్టే భర్తలనుంచి, అత్తమామలనుంచి గృహిణులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో 2005లో అమలులోకి వచ్చిన ఈ చట్టం కొందరు మహిళలకు పెట్టనికోటలా మారింది. అత్తమామల్ని, భర్తనూ వేధించేందుకు ఈ చట్టం కొందరికి ఆయుధంగా మారుతోందని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వివాహిత స్త్రీలకు గృహహింస నుంచి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన సెక్షన్ 498ఎ దుర్వినియోగమవుతోందంటూ గతంలో కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్తతో విభేదించిన మహిళలు అతని తరపు బంధువులందరినీ నిందితులుగా చూపుతున్నారంటూ బాంబే హైకోర్టు ఒక సందర్భంలో అసహనం వ్యక్తం చేసింది. మరో కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెబుతూ పెళ్లికి సంబంధించిన ప్రతి కేసునూ వరకట్న వేధింపుల ఆరోపణలతో పెద్దదిగా చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పేర్కొంది. అంతెందుకు, బెంగళూరుకు చెందిన ఓ టెకీ ఆత్మహత్య ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చనిపోయేముందు 80 నిమిషాల సేపు ఆయన చిత్రీకరించిన వీడియోలోనూ, 40 పేజీల సుదీర్ఘ లేఖలోనూ తన భార్య పెడుతున్న చిత్రహింసల గురించి వివరించిన తీరు మానవతావాదుల హృదయాలను ద్రవీభవింపజేసిందంటే అతిశయోక్తి కాదు. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు… వరకట్నం వేధింపుల చట్టాలు దుర్వినియోగమవుతున్నాయనీ, ఇలాంటి కేసుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని న్యాయస్థానాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సందర్భంలో విడాకుల తర్వాత భార్యకు ఎంత భరణం ఇవ్వాలో లెక్కించేందుకు ఎనిమిది అంశాలతో మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేసింది. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవారు. ఇప్పుడు ఆ నానుడికి కాలం చెల్లింది. గతంలో వంటింటి కుందేళ్లుగా ఉన్న మహిళలు ఇప్పుడు పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పురుషాధిక్య ప్రపంచపు కోటలను బద్దలు కొట్టి అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. మంచిదే, అయితే, కాపురాన్ని ముందుకు నడిపించేవి దంపతులు మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలే తప్ప, ఒకరిపై ఒకరు చూపే ఆధిపత్య ధోరణులు ఎంతమాత్రం కాదు. పవిత్రమైన హిందూ వివాహ వ్యవస్థ ఇటీవల పలుమార్లు కాలపరీక్షకు లోనవుతోంది. వివాహంపైనా, జీవితంపైనా సరైన అవగాహన లేని దంపతులు చిన్నాచితకా వివాదాలను కూడా భూతద్దంలోంచి చూస్తూ విడాకుల కోసం కోర్టుకు ఎక్కుతున్నారు. ఒకప్పుడు కాపురాల్లో కలతలు రేగితే పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పేవారు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. పిల్లలు విడాకులు తీసుకోవాలనుకుంటే సర్దిచెప్పడం అలా ఉంచి, పెద్దలే దగ్గరుండి విడాకులు ఇప్పించే పరిస్థితులు దాపురించాయి. మరోవైపు, వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతున్న విషయాన్ని గమస్తున్న యువతీయువకులు పెళ్లిని కాదని, సహజీవనం వైపు మొగ్గుచూపుతున్నారు. దీని వల్ల భారతీయ వివాహ వ్యవస్థ ఉనికే ప్రమాదంలో పడుతోంది. గృహి హింస, మనోవర్తి చట్టాలు దుర్వినియోగమవుతున్నంత మాత్రాన వాటిని రద్దు చేయాలనే వాదనలు ఎంతమాత్రం సహేతుకం కాదు. ఇప్పటికీ సమాజంలో మహిళలపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. గృహహింసకు లోనవుతూనే ఉన్నారు. కాబట్టి, వారికి రక్షణగా రూపొందిన చట్టాలలోని లొసుగులను పరిహరించే ప్రయత్నం జరగాలి. వాటిని ఆసరా చేసుకుని భర్తలను, అత్తమామలను వేధించాలనుకునే మహిళల భరతం పట్టేలా చట్టాలను పటుతరంగా రూపొందించాలి. లేనిపక్షంలో పవిత్రమైన వివాహ వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం లేకపోలేదు.
బీటలు వారుతున్న వివాహ వ్యవస్థ
- Advertisement -
- Advertisement -
- Advertisement -