Monday, December 23, 2024

అత్యాచార వీడియోల వ్యాప్తి కట్టడి చర్యలు భేష్ : సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు, అత్యాచార వీడియోల వ్యాప్తిని నియంత్రించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీం కోర్టు మూసివేసింది. ఈ అంశంలో సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం… వీడియోల వ్యాప్తి కట్టడి చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్టు గుర్తించింది.

ఈ క్రమం లోనే ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది. వాట్సప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఛైల్డ్ పోర్నోగ్రఫీ , అత్యాచార ఘటనల వీడియోలు విచ్చల విడిగా వ్యాప్తి చెందుతుండటంపై “ప్రజ్వల” అనే స్వచ్ఛంద సంస్థ 2015 లో అప్పటి సీజేఐ హెచ్‌ఎల్ దత్తుకు లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా పిల్ దాఖలు చేసి విచారణ చేపట్టింది. ఈ క్రమం లోనే వీడియోల వ్యాప్తిని కట్టడి చేసేలా తగిన చర్యలు తీసుకునేందుకు సుప్రీం కోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఆ కమిటీ చర్యలను ఎప్పటికప్పుడు న్యాయస్థానం పరిశీలించింది. ఈ కమిటీలో ఫేస్‌బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల ప్రతినిధులు , ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి , కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం డైరెక్టర్ జనరల్, సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇటీవల తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. దీన్ని పరిశీలించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన డివిజన్ బెంచ్ , ఈ విస్తృతమైన అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిపింది.

వీడియోల వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో గణనీయమైన పురోగతి ఉందని పేర్కొంది. ఇక చర్యల అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను మాత్రమే పరిశీలించాల్సి ఉందని, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించింది. ఇక ఈ అంశాన్ని కోర్టు పరిశీలించిన అవసరం లేదని పేర్కొన్న ధర్మాసనం, పిల్ విచారణను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఒకవేళ చర్యల అమలు తర్వాత కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News