Thursday, January 16, 2025

ప్రైవేట్ వ్యక్తులకు అటవీ భూములా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పర్యావరణపరంగా అత్యంత విలువైన అటవీ భూములను పరిరక్షించడంలో తెలంగాణ అధికారులు తమ బాధ్యతలు విస్మరించారని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును తప్పుపడుతూ, దీనిని కొట్టివేసింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని 106 ఎకరాలకు పైగా అటవీభూములను ప్రైవేటుపరం చేయడం, దీనిని ఎటువంటి పత్రాలు ఆధారాలు లేకుండానే ఓ వ్యక్తికి అత్యంత ఉదారంగా కట్టబెట్టడం దారుణం అని, హైకోర్టు చర్య ఔదార్యపు కానుక అయిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అడవుల పట్ల మన వైఖరిలో అ త్యంత తీవ్రస్థాయిలో మార్పు రావల్సి ఉందని , అడవుల పట్ల వ్యక్తి కేంద్రీకృత దృక్పథం పాటించడం కుదరదు. పర్యావరణ ప్రాధాన్యత ల క్రమంలోనే దీని గురించి ఆలోచించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు ఎంఎం సుంద్రేష్, ఎస్‌విఎన్ భట్‌తో కూడిన ధర్మాసనం తెలిపిం ది. మనిషి తప్పనిసరిగా ఇప్పుడు అడవులు, నదీనదాలు, భూములు సరస్సులు చెట్లూ చేమల పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న జనాభా క్రమంలో ఏటేటా అటవీ ప్రాంతానికి ముప్పు వాటిల్లుతోంది. ఇదే దశలో విలువ సంగతి పక్కనపెడితే పర్యావరణ కోణంలో అత్యంత కీలకమైన అటవీ ప్రాంతాన్ని ఓ ప్రైవేటువ్యక్తికి సొంత ఆస్తిగా కట్టబెట్టడం,

దీనికి హైకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడం ఎంతవరకూ సబబు ? అని ప్రశ్నించారు. అనుభవించే హక్కు ఏ ఒక్కరి సొంతం ఎట్లా అవుతుంది? వరంగల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాసీం దివంగతులు అయ్యారు. ఆయన వారసులు ప్రతినిధులు కొందరు తామే 106 ఎకరాల భూమికి వారసులమని, ఇవి అటవీభూములు కావని హైకోర్టుకు వెళ్లారు. కేసు పూర్వాపరాల విచారణ తరువాత హైకోర్టు అంతకు ముందటి భూముల రికార్డుల నిర్థారణ క్రమాన్ని పక్కకు పెట్టి , బంధువుల రివ్యూ పిటిషన్‌కు అనుకూలంగా స్పందించింది. ఈ భూమి అటవీభూమి కాదని, దివంగత ఖాసీం వారసులకే చెందుతుందని తెలిపారు. వీరిదే భూమి అని తీర్పు వెలువరించింది.హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. అటవీ భూమిగానే దీనిని పరిరక్షించాల్సి ఉంటుందని, అయినా అధికారులకు అటవీభూముల పరిరక్షణ సంగతి తెలియదా? అని ప్రశ్నించింది. అభయారణ్యంగా పేర్కొన్న భూమిని , డిక్రీ తరువాత కూడా సరైన విశ్వసనీయ పత్రాల పేరిట హైకోర్టు ఈ భూమి విషయంలో తీర్పు వెలువరించడం పరిధిని కాదని జోక్యం చేసుకోవడం అవుతుందని సుప్రీంకోర్టు మండిపడింది.

హైకోర్టు ఈ విధంగా ఎందుకు స్సందించిందనేది తమకైతే తెలియడం లేదని వ్యాఖ్యానించారు. కాగా ఇది అటవీభూమి అని ప్రభుత్వ అధికారులు ట్రయల్ కోర్టులలో , హైకోర్టులలో తెలంగాణ ప్రభుత్వం తరఫున రుజువుచేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దశలో వివాదాస్పదమైన భూమి విషయంలో విధి నిర్వహణలో నిర్లక్షం వహించిన కొందరు అధికారుల వల్ల హైకోర్టు చివరికి రివ్యూ పరిధిలో ఈ తీర్పు వెలువరించడం, వ్యక్తులకు అటవీ భూముల ధారాదత్తానికి వీలు కల్పించడం అనుచితమే అయిందని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తీర్పును జస్టిస్ సుందరేష్ తమ కొట్టివేశారు. 60 పేజీల సమగ్ర తీర్పు వెలువరించారు. హైకోర్టు తీర్పు తప్పుల తడక, చట్టబద్ధత లేదని , పలు న్యాయచట్టపరమైన తప్పిదాలు ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. ఏది ఏమైనా రివ్యూ పిటిషన్ల క్రమంలో న్యాయస్థానాలకు పరిమిత అధికారాలు ఉంటాయని, అయినా అంతకు ముందే హైకోర్టు ఈ భూముల విషయంలో నిర్థిష్ట రూలింగ్ ఇచ్చిందని ,

ఎపి ల్యాండ్ రెవెన్యూ చట్టం పరిధిలో దీనిని ఎక్కడా ప్రైవేటు ఆస్తిగా పేర్కొనలేదనే విషయాన్ని తెలిపారని , అయితే తరువాత రివ్యూ పిటిషన్ క్రమంలో దీనికి విరుద్ధంగా వ్యక్తులకు అటవీభూములను కట్టబెట్టడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. భూములను అప్పగించిన వ్యక్తి సరైన పత్రాలను చూపకపోయినా సర్దుబాటు తరహాలో కట్టబెట్టడం జరిగిందని ఆక్షేపించారు. ఓ వైపే హైకోర్టు మొగ్గు చూపినట్లుగా ఉందని స్పందించారు. ఇక ఈ భూముల విషయంలో అధికారుల తప్పిదాలు ఏమైనా జరిగి ఉంటే, రికార్డుల తారుమార్లు జరిగినట్లు భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతరంగా దర్యాప్తు చేపట్టవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News