Sunday, December 22, 2024

కేంద్రం పికప్ పద్ధతి సరికాదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హైకోర్టు జడ్జిల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ధోరణి తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని ధర్మాసనం తెలిపింది. దేశంలోని వివిధ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీల గురించి తరచూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేస్తుంది. అయితే ఈ పేర్లకు అనుమతి విషయంలో కేంద్రం కొందరిని ఎంచుకుని బదిలీలకు దిగుతూ వివక్షకు దిగుతోందని ఈ విషయంపై దాఖలు అయిన పిటిషన్ విచారణ దశలో న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధూలియా వ్యాఖ్యానించారు. 11 మంది జడ్జిల బదిలీలకు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఇప్పటివరకూ ఐదుగురిని బదిలీ చేశారు. మిగిలిన వారి విషయం పెండింగ్‌లో ఉంచారు. పెండింగ్‌లో ఉన్న జడ్జిలలో గుజరాత్ హైకోర్టుకు చెందిన నలుగురు, అలహాబాద్, ఢిల్లీకి చెందిన వారు ఒక్కొక్కరిని బదిలీ చేయకుండా ఉంచారు.

ఇక నియామకాలకు సంబంధించి కూడా కొలీజియం సిఫార్సులను కేంద్రం పక్కకు పెడుతోందని ధర్మాసనం ఆగ్రహించింది. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాల గురించి తాము ప్రతిపాదించిన పేర్లలో , ఎనమండుగురి విషయంలో కేంద్రం సాచివేత ధోరణిని అవలంభిస్తోందని , వీరిలో కొందరు జడ్జిలు కావడానికి అవసరమైన సీనియార్టీ బాగా ఉన్నవారూ ఉన్నారని ధర్మాసనం తెలిపింది. ఏరికోరి బదిలీలు, నియామకాల ప్రక్రియకు దిగరాదని తాము ఇంతకు ముందు కూడా కేంద్ర న్యాయమంత్రిత్వశాఖకు తెలియచేశామని, ఇప్పటికీ ఇదే ధోరణిని పాటిస్తున్నారని ధర్సాసనం స్పందించింది. ప్రత్యేకించి గుజరాత్ హైకోర్టు జడ్జిల బదిలీల గురించి చేసిన సిఫార్సులను కేంద్రం పక్కకు పెట్టడం వివాదాస్పదం అవుతోంది. సీనియార్టీని దృష్టిలోపెట్టుకునే కొలీజియం న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేస్తుంది. ఈ క్రమంలో కేంద్రం కావాలనే లేదా ఇతర కారణాలతోనో వీటిని పక్కకు పెట్టడం వల్ల చివరికి సీనియార్టీ ప్రాతిపదికన నియామకాల ప్రక్రియకు అర్థం ఉండదని , కేంద్రం కొందరినే ఎంచుకుని నియామకాలకు దిగడం వల్ల సీనియార్టీ ఉన్న వారికి న్యాయం దక్కడం లేదు.

పైగా తమ సిఫార్సుకు నియామక ప్రక్రియకు మధ్య కేంద్రం జాప్యంతో కొందరు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడుతోందని , ఇటువంటి పరిణామాలు దేనికి దారితీస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. కొన్ని రాష్ట్రాలలో అక్కడి వ్యాజ్యాలు , సంక్లిష్టతల నడుమ మరికొందరు జడ్జిల అవసరం ఉంటుంది. అదే విధంగా కొందరు జడ్జిలను బదిలీ చేయాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థ నిర్వహణ క్రమంలో సుప్రీంకోర్టు కొలీజియం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సులకు పాల్పడుతుంది. అయితే దీనికి బ్రేక్ వేస్తూ కేంద్రం ఈ బదిలీలు, నియామకాలలో తన ఇష్టానుసారం ఎంపిక చేసుకుని వ్యవహరించడం అనుచితం అవుతోందని తెలిపారు. గుజరాత్, పంజాబ్, హర్యానా, అసోం హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీల విషయంలో ఆలస్యం గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. 2021 తీర్పు ప్రకారం జడ్జిల నియామకాల విషయంలో సరైన గడువును ఖరారు చేశారు. అయితే దీనిని కేంద్ర న్యాయ చట్ట మంత్రిత్వశాఖ పట్టించుకోవడం లేదని , ఇది కోర్టుధిక్కారం పరిధిలో ఆలోచించాల్సిన విషయం అని పిటిషన్లు దాఖలు అయ్యాయి.

బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్, కూడా పిటిషనర్లలో ఒకటిగా ఉంది. లాయర్ల సీనియార్టీ దెబ్బతినే రీతిలో నియామకాల ప్రక్రియలు జరుగుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్న అంశంతో ధర్మాసనం ఏకీభవించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి స్పందించారు. కొలీజియం సిఫార్సుల పేర్లకు సంబంధించిన విషయానికి వస్తే ఈ ప్రక్రియ పరిశీలన తరువాత అనుమతుల క్రమంలో పురోగతిలో ఉందన్నారు. ఈ పిటిషన్ల విచారణను ఓ వారం తరువాత లేదా పదిరోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. అప్పుడు పలు విషయాలపై స్పష్టత వస్తుందన్నారు. దీనితో సుప్రీంకోర్టు ఈ విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News