Thursday, December 19, 2024

విద్వేష ప్రసంగాల కేసుల పరిశీలనకు కమిటీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మతాల మధ్య పరస్పర సామరస్యం, సహకారం ఉండాలని, ఇది అన్నిమతాల బాధ్యత అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ్యాప్తంగా విద్వేష ప్రసంగాల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇలాంటి ప్రసంగాల కారణంగానే హర్యానాలో చెలరేగిన మత ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ దాఖలయిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.. హర్యానా సహా వివిధ రాష్ట్రాల్లో ఒక వర్గం వారిని చంపేయాలని, వారిని సాంఘికంగా ఆర్థికంగా బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తూ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, వీటిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టు షహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ప్రతిపాదిత కమిటీగురించి కేంద్రంనుంచి ఆదేశాలు తీసుకుని ఈ నెల 18లోగా తెలియజేయాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్‌ను జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌విఎన్ కూడిన బెంచ్ ఆదేశించింది. ‘ మతాల మధ్య పరస్పర సామరస్యం,స్నేహం ఉండాలి. ఇది అన్ని మతాల బాధ్యత.

విద్వేష ప్రసంగాల సమస్య ఏమాత్రం మంచిది కాదు. ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు, ఇతర సమాచారాన్ని నోడల్ ఆఫీసర్లకు అందించాలని పిటిషనర్‌ను కూడా బెంచ్ ఆదేశించింది. ముగ్గురు లేదా నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర పోలీసు చీఫ్‌ను ఆదేశిస్తామని, వివిధప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు అందిన విద్వేష ప్రసంగాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని బెంచ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకమని, ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా నటరాజన్ చెప్పారు. కొన్ని చోట్ల విద్వేష ప్రసంగాలను అడ్డుకునే యంత్రాంగం సరిగా పని చేయడం లేదని కూడా ఆయన అంగీకరించారు. విద్వేష ప్రసంగాలనుంచి ప్రజలకు రక్షణ కల్పించి తీరాలని, ఈ తరహా విషపూరిత వాతావరణాన్ని ఇంకా కొనసాగనివ్వరాదని పిటిషనర్ అబ్దుల్లా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు.

తాము ప్రతిపాదించిన కమిటీ గురించి బెంచ్ అడగ్గా రాబోయే రెండు రోజుల్లో ముస్లింలను బైటికి గెంటి వేయండని ఎవరో కొందరు దుకాణదారులను కోరినప్పుడు ఈ కమిటీ ఎలాంటి సాయం చేయలేదు’ అని సిబల్ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పోలీసులు చెబుతూనే ఉన్నారని, అయితే నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం కానీ, ప్రశ్నించడం కానీ జరగలేదని కూడా ఆయన అన్నారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News