న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశాలపై కోర్టులు ఆయా కేసుల మెరిట్స్ బట్టి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ కోర్టు జూన్ 2న ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌దారుడు రెండు నెలల తరువాత యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ దరఖాస్తు చేయడం మెచ్చుకోలేమని పేర్కొంది. వెకేషన్ బెంచికి చెందిన జస్టిస్‌లు సిటి రవికుమార్ , సుధాంశు దూలియా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. పిటిషన్‌దారుడు తన దరఖాస్తులో యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ హైకోర్టుకు ఆగస్టు 31న దాఖలు చేశారు. అయితే అందులో మధ్యంతర రక్షణ కల్పించాలని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ అంశంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉన్నందున కోర్టు ఏదో ఒక రూపంలో కేసు మెరిట్స్‌ను పరిగణించి ఉత్తర్వులు వేగంగా జారీ చేయవలసి ఉందని తాము గ్రహించినట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
పిటిషన్‌దారుడు యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ చేసిన దరఖాస్తు మే 24న కోర్టుకు దాఖలైందని, కోర్టు తిరిగి ప్రారంభమైన తరువాత చట్టప్రకారం వేగంగా మూడు వారాల్లోనే దీన్ని పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత వ్యవధిలో ప్రధాన అభ్యర్థన ఏ కారణం చేతనైనా పరిష్కారం కాకుంటే తాత్కాలికంగా ఊరట కల్పించాల్సి ఉంటుందని సూచించింది. అప్పటివరకు పిటిషన్‌దారునికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ మంజూరు చేస్తున్నామని సుప్రీం వివరించింది. జూన్ 2న హైకోర్టు తాను ఇచ్చిన ఉత్తర్వులో మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తరువాత పిటిషనర్ యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ దరఖాస్తు చేశాడని పేర్కొంది. దీనిపై హైకోర్టు నోటీసు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది యథాతధ స్థితిపై నివేదిక సమర్పించడానికి వ్యవధి కోరారు. ఈ కేసు ఆగస్టు 31న విచారణ జాబితాలో చేర్చడమైంది.