హైకోర్టు జడ్జిపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు
న్యూఢిల్లీ: తనపై హైకోర్డు న్యాయమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించి 2014లో రాజీనామా చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మహిళా న్యాయాధికారిని పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఆమె తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తాము పరిగణించడం లేదని కోర్టు పేర్కొంది. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెను తిరిగి అదనపు జిల్లా జడ్జిగా నియమించాని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. అయితే ఆమెకు పాత వేతన బకాయిలు రావని ధర్మాసనం స్పష్టం చేసింది.
2014 జులై 15న గ్వాలియర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి పదవికి ఆమె రాజీనామా చేయగా దాన్ని 2014 జులై 17న ఆమోదించారని, ఆమె రాజీనామాను స్వచ్ఛందంగా తాము పరిగణించడం లేనందున రాజీనామాను ఆమోదిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆమెకు పాత వేతన బకాయిలు ఏవీ రావని, అయితే 2014 జులై 15 నుంచి సర్వీసు కొనసాగింపు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా..ఆమె లైంగిక ఆరోపణలు చేసిన హైకోర్డు న్యాయమూర్తిపై విచారణ జరిపిన రాజ్యసభ నియమించిన కమిటీ 2017 డిసెంబర్‌లో ఆయనపై ఆరోపణలు ఆవాస్తవాలని తేల్చి ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది.