Monday, December 23, 2024

రాజీవ్ గాంధీ హత్య కేసు… దోషి పేరరివాళన్ విడుదలకు సుప్రీం ఓకే

- Advertisement -
- Advertisement -

Supreme Court orders release of A G Perarivalan

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు బుధవారం కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి పేరరివాళన్ ను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పేరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవిత ఖైదు అనునభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర నిందితులకు కూడా మార్గం సుగమమైనట్టయింది. పేరరివాళన్ విడుదలకు 2016,2018 లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ , గవర్నర్‌తో విభేదాల కారణంగా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత గత ఏడాది తమిళనాడు గవర్నర్ పేరరివాళన్ క్షమాభిక్ష దస్త్రాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వ సిఫార్సులపై పేరరివాళన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. అతడి క్షమాభిక్ష నష్టాన్ని గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారని, దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేవరకు నిరీక్షించాలని గతంలో కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

దీనికి న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. క్షమాభిక్షకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్… అందుకు సంబంధించిన దస్త్రాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేయడాన్ని ఆక్షేపించింది. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగించకుండా … రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చా? లేదా ? అనేది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక , పేరరివాళన్ 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడని, జైల్లో అతని ప్రవర్తన బాగుందని తెలిపింది. జైల్లో ఉంటూనే అతను ఉన్నత విద్యను అభ్యసించిన విషయాన్ని గుర్తు చేసింది. 20 ఏళ్ల శిక్ష పూర్తి చేసిన వారిని విడుదల చేయాలని గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి. అలాంటప్పుడు పేరరివాళన్ విషయంలో వివక్ష చూపడం సరికాదని అభిప్రాయపడింది. గతవారం దీనిపై సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరపగా, కేంద్రం తన వాదనలు వినిపించింది. క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉందని తెలిపింది. దీన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. అంటే ఇన్నేళ్ల పాటు గవర్నర్లు ప్రసాదించిన క్షమాభిక్షలు రాజ్యాంగ విరుద్ధమా ? అని ప్రశ్నించింది. ఈ అంశంపై సుప్రీం కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది.

ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి పేరరివాళన్ విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం స్పష్టం చేసింది. 1991 మే 21 న తమిళనాడు లోని శ్రీ పెరంబుదూరు లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై థను అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు మరో 14 మంది మృతి చెందారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998 లో వారికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాదే పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్, మరణ శిక్షను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అనంతరం 2014 లో పేరరివాళన్‌తోపాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఇక సోనియా గాంధీ జోక్యంతో 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News