Monday, December 23, 2024

సభానేతను కలిసి.. క్షమాపణ తెలుపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ ఛద్దా సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. ఆయన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ను కలిసి, సభలో తన ప్రవర్తనపై క్షమాపణలు తెలియచేయాలని ఆదేశించింది. ఢిల్లీ బిల్లుకు సంబంధించి ఈ ఆప్ ఎంపి సభలో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆగస్టు 11న సభాధ్యక్షులు ఈ ఎంపిని నిరవధికంగా సస్పెండ్ చేశారు. సంబంధిత విషయంపై తనకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను ఈ బహిష్కృత ఎంపి తమ సామాజిక మాధ్యమంలో తెలిపారు. తాను వెంటనే రాజ్యసభ ఛైర్మన్‌ను కలుసుకునేందుకు అనుమతి కోరినట్లు వివరించారు.

ఎంపి వెలువరించే క్షమాపణను రాజ్యసభ ఛైర్మన్ సానుభూతితో ఆమోదించాలని, ఈ వివాదానికి ముగింపు పలుకాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది. రాఘవ తొలిసారి ఎంపి అని, సభలో అందరి కన్నా చిన్నవాడని , ఆయనకు సానుకూల రీతిలో అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా ఇప్పటి పరిణామంపై అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ ఈ ఉదంతానికి సంబంధించి పార్లమెంట్ హక్కుల కమిటీ సమావేశం అవుతోందని, ఎటువంటి తదుపరి చర్యలు ఉంటాయనేది స్పష్టం అవుతుందని తెలిపారు. కాగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను దీపావళి తరువాతి తేదీకి వాయిదా వేసింది. కేసుపై తమకు పూర్తి వివరాలు అందించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News