కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన 400 ఎకరాల ఈ భూముల్లో చెట్లను తొలగించడంపై సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అఫిడవిట్ దాఖలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే అని అఫిడవిట్ లో తెలిపారు.
బుధవారం ఈ భూములపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 100 ఎకరాల్లో చెట్ల తొలగింపుకు ముందస్తు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. తిరిగి 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలని.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతామని జస్టిస్ గవాయ్ హెచ్చరించినట్లు సమాచారం. తీర్పు వచ్చే వరకు చెప్పే వరకు ఆ భూముల్లో ఒక్క చెట్టును నరకవద్దని ఆదేశించారు. తదుపరి విచారణ మే 15కు సుప్రీం వాయిదా వేసింది.