మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానంపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: గత ఏడాది జులైలో మిగిలిన సమావేశాల కాలానికి మించి మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బిజెపి సభ్యులను సస్పెండ్ చేస్తూ ఆమోదించిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇందులో హేతుబద్ధత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అసెంబ్లీ స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణపై మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. గత ఏడాది జులైలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల మిగిలిన రోజులకు మించి ఏడాది పాటు 12 మంది బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఇది హేతుబద్ధ చర్య కాదని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్మానాన్ని చట్టవ్యతిరేకమైనదిగా పరిగణిస్తూ కొట్టివేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్ ఉన్నారు.