మణిపుర్ గవర్నర్ తీరును ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ : లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నందుకు మణిపుర్‌లో 12 మంది బిజెపి శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించే అంశంపై రాష్ట్ర గవర్నర్ ఎటూ తేల్చక పోవడంపై సుప్రీం కోర్టు నిలదీసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని వెల్లడించినా గవర్నర్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోక పోవడాన్ని జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో కొనసాగుతున్న 12 మంది బిజెపి ఎమ్‌ఎల్‌ఎలను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2018 లో కరాంగ్ ఎమ్‌ఎల్‌ఎ డి.డి తెసిల్ తదితరులు పిటిషన్ వేశారు. మణిపుర్‌లో అమలులో ఉన్న రెండు చట్టాలు ఇచ్చిన మినహాయింపు వల్లనే వారు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగ గలిగారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయడానికి ఈసి నిరాకరించింది.
అనంతరం రాష్ట్ర హైకోర్టు ఈ రెండు చట్టాలను కొట్టి వేసింది. దీంతో 12 మంది ఎమ్‌ఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలని మణిపుర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ సజ్మాహెప్తుల్లాకు విన్నవించింది. దీనిపై గవర్నర్ నిరుడు అక్టోబరులో మళ్లీ ఈసీ అభిప్రాయం కోరారు. ఎమ్‌ఎల్‌ఎలు పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో నియమితులైనప్పుడు పైన చెప్పుకొన్న రెండు చట్టాలు అమలులో ఉన్నందున వారిని అనర్హులుగా పరిగణించలేమని ఈసి జనవరి 13న గవర్నర్‌కు తెలిపింది. దీనిమీద తన నిర్ణయమేమిటో తెలపకుండా గవర్నర్ నాన బెడుతున్నారని పిటిషన్‌దారు తైసిల్ సుప్రీం దృష్టికి తీసుకు వచ్చారు. మణిపుర్ శాసన సభ పదవీకాలం మరో నెలలో ముగియనుందనీ, ఈలోగా గవర్నర్ ఏమీ తేల్చకపోతే పిటిషన్ మురిగిపోతుందని గుర్తు చేశారు. అయితే సొలిసిటర్ జనరల్ వేరే ధర్మాసనం ముందు మరో కేసు వాదిస్తున్నందున ఎమ్‌ఎల్‌ఎల కేసును వాయిదా వేయాలని రాష్ట్ర న్యాయవాది కోరారు. దీంతో ధర్మాసనం విచారణను ఈనెల 11 వ తేదీకి వాయిదా వేసింది.