Wednesday, January 22, 2025

దోషుల ముందస్తు విడుదల పద్ధతేనా

- Advertisement -
- Advertisement -

దోషుల ముందస్తు విడుదల పద్ధతేనా
పద్ధతి పాటిస్తే ఇతరులకు వర్తిస్తుందా?
జైలులో ప్రత్యేక సలహా కమిటీలు ఎందుకు?
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
తదుపరి విచారణ 24కు వాయిదా
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులను ముందస్తుగానే ఏ ప్రాతిపదికన విడుదల చేస్తారు? నేరస్థుల విషయంలో ఎంచుకుని న్యాయం పాటిస్తారా? అని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో చురకలు పెట్టింది. గుజరాత్ లో 2002 ఘర్షణల దశలో జరిగిన దారుణ ఘటన, సామూహిక ఊచకోత బిల్కిస్ కేసుగా న్యాయస్థానం ముందుకు విచారణకు వచ్చింది. దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలు అయిన పలు పిటిషన్లపై విచారణ సాగుతోంది. బిల్కిస్‌పై మూకుమ్మడి అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల దారుణ వధ ఘటనలో దోషుల మరణశిక్షలను యావజ్జీవ ఖైదుగా మార్చారు. ఈ శిక్షల పరిధిలో ఉన్న వారిని 14 ఏండ్ల జైలుశిక్ష తరువాత విడిచిపెట్టడం భావ్యమేనా అని ప్రశ్నించారు.

ఇది సరైనదే అనుకుంటే ఇటువంటి శిక్షలను అనుభవిస్తున్న వారికి కూడా దీనిని వర్తింపచేస్తారా? విడిచిపెట్టే పాలసీ పాటిస్తే ఇందులో కూడా పాలసీని నిర్ణీతంగా అమలుపరుస్తారా? అని న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్వల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం నిలదీసింది. కరడుగట్టిన క్రిమినల్స్‌ను సంస్కరించేందుకు ఇదో అవకాశం అనే అనుకుంటే ఈ నిబంధనను ఇతర ఖైదీలకు వర్తింపచేస్తారా? అని ప్రశ్నించారు. సంస్కరింపబడేందుకు కల్పించే అవకాశం అందరికీ వర్తించాల్సి ఉంటుంది. పోనీ ఈ పద్ధతిని పాటిస్తున్నారా? పాటిస్తే జైళ్లు ఎందుకు కిక్కిరిసిపోతున్నాయి? సరైన లెక్కలు ఇవ్వగలరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. జైల్లో బిల్కిస్ బానో దోషులకు ప్రత్యేకమైన గుర్తింపు ఏమైనా కల్పించారా? ఏకంగా వారికి జైలు సలహా కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరాలు అందించాల్సి ఉందన్నారు.

మరి సంబంధిత ఘటనకు సంబంధించి గోద్రా కోర్టులో విచారణ జరగలేదని, కనీసం దోషులకు శిక్షల తగ్గింపుల దశలో గోద్రా కోర్టు అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు తమ వాదన విన్పించారు. దోషుల విడుదల నిర్ణయాలపై పాటించే పద్ధతులపై పలు రాష్ట్రాల నుంచి వివరణ తీసుకుంటే మంచిదని సూచించారు. ఇక చట్టప్రకారమే దోషులను విడిచిపెట్టారని, వారికి 2008లో శిక్షపడిందని, వీరి విడుదల విషయంలో 1992 పాలసీని పాటించామని తెలియచేసుకున్నారు. వాదనలు కొనసాగుతున్నాయని, తదుపరి విచారణ ఈ నెల 24న ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News