సిబిఐకి సుప్రీం ధర్మానసం చురకలు
న్యూఢిల్లీ : పిటిషన్ల దాఖలులో జాప్యం జరగకుండా కార్యనిర్వాహక చర్యలు తీసుకోవాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ సమర్ధవంతంగా ఉండేందుకు ఐటి ప్రాతిపదిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, దీని వల్లనే వీటిపై సరైన పర్యవేక్షణకు వీలేర్పడుతుందని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎంఆర్ షా సహిత ధర్మాసనం శనివారం రూలింగ్ వెలువరించింది. ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019 జూన్‌లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వెలువరించిన తీర్పుపై దర్యాప్తు సంస్థ సిబిఐ అప్పీల్ విషయంలో ఏకంగా 647 రోజుల ఆలస్యం జరిగింది.
ఇదేమిటని అడిగితే సిబిఐ ఇచ్చిన సమాధానం అత్యంత పేలవంగా, అనిర్థిష్టంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి అసాధారణ జాప్యాలు ఇక ముందు జరగకుండా అన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకుని తీరాలని సిబిఐని ఆదేశించడం జరుగుతోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పీళ్ల సంబంధిత అధికారులు నిర్ధేశిత కాలంలో స్పందించకపోవడంతో అనేక చిక్కులుతలెత్తుతాయి. పైగా ఈ జాప్యానికి ఇచ్చే కారణాలు పెద్ద ఎత్తున అపార్థాలకు దారితీస్తాయని దర్యాప్తు సంస్థ వైఖరిని ధర్మాసనం తప్పుపట్టింది. కోవిడ్, సంబంధిత లాక్‌డౌన్‌లతోనే అప్పీలు చేయడంలో జాప్యం జరిగిందనే వాదన సరికాదని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తీర్పు 2019 జూన్‌లో వెలువడింది. దేశంలో కరోనా మహమ్మారి 2020 మార్చిలో ఆరంభం అయింది. మరి సిబిఐ వివరణకు అర్ధంపర్థం ఉందా? అని నిలదీసింది.