Monday, January 20, 2025

స్వీయ సంస్కరణలో సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

భారత ఉన్నత న్యాయస్థానం లింగ వివక్షల మూసపోత కట్టడికి కరదీపికను జారీ చేసింది. ఇది మహిళా సంఘాల సామాజిక, న్యాయ పోరాటాల ప్రధాన న్యాయమూర్తి ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ చొరవల ఫలితం. న్యాయపర నిర్ణయాలు, రచనల్లో అపాయకర మహిళా వివక్షను నివారించే సూచిక ఈ కరదీపిక. కొందరి పట్ల, కొన్నిటి గురించి ప్రజల్లో పేరుకుపోయిన తప్పుడు భావజాలమే మూసపోత పదాలు. ఇవి నిర్దిష్ట సమాజసామూహిక లక్షణాలు, ఊహలు, నమ్మకాలు. జాతీయత, ప్రాంత, కుల, మతజాతి, లింగ, లైంగికతత్వ, మానసిక బలహీనతలు. వంటి రంగు, భౌతిక రూపం వగైరాలతో కొందరు నిరంతరం మూస ఆలోచనకు గురవుతారు.న్యాయమూర్తులుగా మనం చేసిన ప్రమాణం భయం, పక్షపాతం, అభిమాన దురభిమానాలు లేకుండా విధులను నిర్వహించాలని ఆదేశిస్తోంది. మన ముందున్న కేసులలో భౌతిక దృక్పథంతో రాజ్యాంగాన్ని అన్వయించాలి. అక్రమ ప్రయత్నాలను తిరస్కరించాలి. మన భావాలను పక్కన పెట్టాలి. సంజాత లింగ వివక్షలు, స్త్రీ వ్యతిరేక భాష మన విధుల విరోధాలు. రాజ్యాంగ అనుసంధానాన్ని స్త్రీకి హానికరంగా వక్రీకరిస్తాయి.

పితృస్వామ్య భావాలతోసామాజిక, మానవత్వ విలువలు, సమానత్వ హక్కులు దెబ్బతింటాయి. లింగ వివక్షను గుర్తించడంలో, ప్రత్యామ్నాయ పదాలను అందించడంలో, శాసన వివేక కల్పనలో న్యాయ సమూహానికి ఈ కరదీపిక దోహదపడుతుంది అని చంద్రచూడ్ ముందు మాటలో ముచ్చటించారు. మనందరమూ ఏదో ఒక సందర్భంలో ఆలోచనల్లో, రాతల్లో, పనుల్లో మూస పదాలను వాడిన వాళ్ళమే. సామాజిక, సాంస్కృతిక, పరిసర ప్రభావాలతో ఈ ఆలోచనలు మన అంతర్గత భావాల్లో పాతుకుపోయాయి. కష్టమైనా వీటిని వదలడం సమాన, సమ్మిళిత, కారుణ్య సమాజ నిర్మాణానికి అవసరం. న్యాయ వ్యవస్థలో ఈ భావజాల పద ప్రయోగం సమాజంలో కొందరి తేడాలను, బళ్ళలో, పని స్థలాల్లో, ప్రజా సంస్థల్లో మినహాయింపులనుశాశ్వతీకరిస్తుంది. దుర్భాషల, ప్రత్యామ్నాయ పద బంధాల గుర్తింపులో, తప్పొప్పుల తర్కంలో, న్యాయ వ్యవస్థలో వీటి నివారణలో ఈ కరదీపిక సహకరిస్తుంది.

ఉద్దేశరహితంగా, ఉపచేతనంగా మూస పదాలను వాడతాం. ఎదుటివారి వ్యక్తిత్వాలను, లక్షణాలను గుర్తించం. వారి పట్ల తప్పుడు అభిప్రాయాలను ఏర్పర్చుకుంటాం. పక్షపాతాలను పాటిస్తూనే పక్షపాత రహితులమని మూస భాషతో ప్రకటిస్తాం. సందర్భ సత్యాలను అర్థం చేసుకోం.ఈ గుణాలు న్యాయ స్థానాల తీర్పులకు నల్లరంగును పులుముతాయి. న్యాయ వ్యవస్థ సభ్యులూ ఈ అసమ సమాజ ఉత్పత్తులే. న్యాయ వ్యవస్థలో పక్షపాతం, మేధో వక్రత సమాజానికి అపార నష్టం చేస్తాయి. కొన్ని తీర్పులు న్యాయసమ్మతమైనా వాటి సమర్థన తార్కిక తత్వం, నిర్హేతుక కారణాలునిందితుల లక్షణాలకు, స్వయం ప్రతిపత్తికి, స్వీయ గౌరవానికి భంగం కలిగిస్తాయి. ఇవి ‘చట్టాల సమాన రక్షణ’ రాజ్యాంగ సూత్ర వ్యతిరేకం. అన్యాయ విష వలయాన్ని నిర్మిస్తాయి. కార్యాలయాల్లో ఒకే ఉద్యోగంలో ఉన్నా ఆడు వారికి అప్పజెప్పే, మగాళ్ళకు కేటాయించే పనులను లైంగికీకరిస్తాం. వివక్ష బాధితులు మానసిక వత్తిడికి గురవుతారు. బ్రాహ్మణ భిక్షువుకు, అడుక్కు తినే శూద్రునికి తేడా ఉంటుంది.

అల్పాదాయ ప్రజలు ఎక్కువ నేర ప్రవృత్తితో ఉంటారన్న నింద పేదల సామాజిక బహిష్కరణ. న్యాయమూర్తులు ఈ అభిప్రాయంతో ఉంటే అపాయం మరింత పెరుగుతుంది. వ్యక్తి హక్కులు హరించబడతాయి.పేదలకు పెద్దశిక్ష, పెద్దలకు చిన్నశిక్ష విధించే అవకాశం ఉంది. దీంతో డబ్బున్న నిందితుడు నేర ప్రవృత్తితో సమాజంలో తిరుగుతాడు. నిరుపేద జైల్లోనే మగ్గిపోతాడు, స్త్రీ పురుషులకు ప్రత్యేక గుణాలను ఆపాదిస్తారు. ఆడువారు అత్యాచారాల్లో అబద్ధం చెపుతారన్నది అందులో ఒకటి. న్యాయమూర్తి ఈ ఉద్దేశంతో తీర్పిస్తే బాధిత స్త్రీలు తీవ్ర అన్యాయానికి బలవుతారు.లైంగికతత్వ వివక్షల మూసవాదాలు మూడు రకాలు. 1. స్త్రీల స్వాభావిక లక్షణాలు: స్త్రీ, పురుషులకు విభిన్న లక్షణాలుంటాయని నమ్ముతారు. ఈ ఊహలను భావోద్వేగ, భౌతిక, మేధో వికాస సామర్థ్యాలకు విస్తరిస్తారు. 2. స్త్రీల లైంగికతత్వ పాత్రలు: సమాజం స్త్రీ, పురుషులకు లింగాధారంగా నిర్దిష్ట చర్యలను, పాత్రపోషణలను ఆపాదిస్తుంది. ఇవి సామాజిక నిర్మాణ అవగాహనల ఉత్పత్తులు. మగాళ్ళు ఉద్యోగాలకు, మహిళలు గృహ నిర్వహణకు యుక్తులని ప్రచారం చేశారు. శాస్త్ర సాంకేతిక వృత్తుల్లో, సామాజిక నిర్మాణంలో ఆరితేరిన స్త్రీలు కూడా ఇంట్లో స్త్రీ పాత్ర పోషించాల్సిందే.

ఉన్నత స్థాయి స్త్రీలూ బట్టలు, మాటలు, ప్రవర్తనల్లో ఆడువారి అంతర్గత లక్షణాలకు లోబడి ఉండాలని భర్త, ఇతర కుటుంబ సభ్యులతో సహా సమాజం ఆదేశిస్తుంది.ఈ లైంగికతత్వ పాత్రల నుండి ఏమాత్రం వైదొలగినా సామాజిక కళంకానికి దారితీస్తుంది. అంకిత అర్ధాంగిగా మొగుని కంటే ముందు మేల్కొని అతని అవసరాలను తీర్చాలని, విధేయ భార్యగా అతను కోరినట్లు బట్టలు ధరించాలని వివరిస్తూనే ఆ పనులు చేయనంత మాత్రాన భర్త భార్యను కొట్టరాదని ఒక హైకోర్టు తీర్పిచ్చింది.
వివక్షలతో వివరణ, అంకిత, విధేయ వంటి పదాలు మూస ధోరణులను బలపరుస్తాయి, వాటి ప్రాముఖ్యతలను ఉద్ఘాటిస్తాయి. స్త్రీల సామాజిక అంచనాలు, వారి వృత్తి లభ్యతా లేమి, మాధ్యమాల్లో ఆడపనుల నిర్వచనం, బయట పనులకు పోతే మహిళలు కళంకితులవుతారన్న దుష్ట చింతన స్త్రీలను ఇళ్లలోనే బంధించాలన్న మగ బుద్ధులకు మూలాలు. 3. లింగ, లైంగికతత్వ, లైంగిక హింసలు: స్త్రీల మాటలు, బట్టలు, వృత్తుల ఆధారంగా వారి ప్రవర్తన, గుణాలను అంచనా కడతారు. ఈ ఊహల ఆధారంగానే న్యాయ స్థానాల్లో స్త్రీల సాక్ష్యాల, చర్యల మూల్యాంకనం చేస్తారు.

ఈ దురవగాహనలు అత్యాచారాల్లో, లైంగిక హింసల్లో, హత్యల్లో స్త్రీల ప్రాముఖ్యతను తగ్గిస్తాయి. వారిని అన్యాయానికి గురి చేస్తాయి. ఆడువారి గత కాల అలవాట్ల, వృత్తుల ఆధారంగా తాజా కేసుల్లో నిర్ణయించరాదు.ఒక సుప్రీంకోర్టు- తీర్పు ప్రకారం వివాహిత వ్యక్తికి అవివాహితతో లైంగిక సంబంధం తప్పు కాదు. అతను మరొకరి భార్యతో వివాహేతర చర్యకు పూనుకోడం తప్పు. భార్య భర్త సొత్తు, పర సొత్తుతో దుష్ప్రవర్తన శిక్షార్హ నేరం. పితృస్వామ్య భావాలతో సమాజం లైంగిక చర్యల్లో స్త్రీ పురుషులకు వేరు వేరు ప్రమాణాలను నిర్ణయించింది.
కొమ్మలను కొయ్యలకు కట్టేసింది. మగాళ్లను దేవరదున్నల్లా వదిలేసింది. పవిత్రత, గౌరవం వంటి భావాలు స్త్రీలకు సామాజిక, సాంస్కృతిక కట్టుబాట్ల జీవితాలను నిర్దేశించాయి. రాజ్యాంగం ఇచ్చిన స్వీయ గౌరవం, గోప్యతల హామీల నుండి వనితలను వంచించారు. అత్యాచారాలలో స్త్రీ శీలం చెడుతుంది. మగమానం మలినమవదు. అత్యాచార ధ్రువీకరణలో రెండు వేళ్ళ పరీక్ష నేర పక్షపాత అవకాశం, అశాస్త్రీయం, అమానవీయం. అత్యాచార బాధితురాలి సాక్ష్యాన్ని నమ్మాలి. ఆమె వంటి మీద గాయాలు లేవు కాబట్టి ఆమె సంభోగానికి సమ్మతించిందని వాదించరాదు. పోలీసు స్టేషన్‌లో అత్యాచార ఆలస్య నమోదుకు స్త్రీ బలహీనతలు, సామాజిక కళంక అపోహలు కారణం. ఆ సాకుతో అత్యాచారం కల్పితమనరాదు. ఈ కరదీపికలో ఆడువారిని అవమానించే పదాలకు, పద బంధాలకు ప్రత్యామ్నాయాలను సూచించారు. స్త్రీల వ్యతిరేకతలను, అనుకూలతలను ప్రకటించిన అనేక కోర్టు తీర్పులను ఉటంకించారు.

స్త్రీల హక్కుల హామీదారైన న్యాయ యంత్రాంగం స్త్రీ వివక్షల మూసపోతలను ఆపాలి. అనాలోచిత అవగాహనలను సవాలు చేయాలి. స్త్రీ సమానతకు, న్యాయ వ్యవస్థ సంస్కరణలకు పాటు పడాలి. ఈ కరదీపిక వివక్షాపూరిత మూసపోతల పట్ల అవగాహన కల్పిస్తుంది. సమర్థనావాద వివేకంతో, సగౌరవ భాషతో న్యాయమూర్తుల సాధికారితకు దోహదపడుతుంది. భారత ఉన్నత న్యాయస్థానం అనేక పూర్వోదంతాలను (precedents) ఈ కరదీపికలో ఉటంకించింది. రాజ్యాంగ అధికరణ 141 ప్రకారం అవి అన్ని శ్రేణుల కింది కోర్టులకు శిరోధార్యాలు. ఆచరణాదేశాలు. అభిజాత్య మగ మనస్సును మార్చుకోలేని ప్రపంచ వ్యాపిత పురుష ప్రగతిశీలురకు, పత్రికలకు, ప్రజలకు, ప్రత్యేకించి (మన కేంద్ర) రాజకీయులకు ఈ కరదీపిక కఠిన హెచ్చరిక, క్రమం తప్పిన వారికి కఠోర కరవాలం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News