Friday, December 20, 2024

రాందేవ్ బాబాపై సుప్రీం కోర్టు అసహనం

- Advertisement -
- Advertisement -

Supreme Court reacts on Ramdev Baba disputed comments

న్యూఢిల్లీ: అల్లోపతి లాంటి ఆధునిక వైద్య విధానాలను విమర్శిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయన అనుసరించే విధానాలు అన్ని రోగాలను నయం చేస్తాయన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. అల్లోపతి వైద్యులు, ఔషధాలు, కొవిడ్ వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న విస్తృత ప్రచారాలపై భారత వైద్య మండలి (ఐఎంఎ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం అల్లోపతిపై రాందేవ్ బాబా విమర్శలను ప్రస్తావించింది. “ ఆయన అల్లోపతి వైద్యులపై రాందేవ్ బాబా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన యోగాకు ప్రాచుర్యం కల్పించారు. మంచిదే కానీ … ఇతర వ్యవస్థలను ఆయన విమర్శించకూడదు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్నింటినీ నయం చేస్తాయన్న గ్యారెంటీ ఏంటి ?” అని జస్టిస్ ఎన్‌వి రమణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఐఎంఎ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గత ఏడాది కొవిడ్ రెండోదశ వ్యాపించిన సమయంలో అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. అల్లోపతి పనికిమాలిన వైద్యం అంటూ ఆయన వ్యాఖ్యానించడం, ఓ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో భారత వైద్య మండలితోపాటు అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు రాందేవ్‌కు వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

Supreme Court reacts on Ramdev Baba disputed comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News