Monday, December 23, 2024

సుప్రీం సముచిత నిర్ణయం

- Advertisement -
- Advertisement -

రాజద్రోహం లేదా దేశద్రోహం (భారత శిక్షాస్మృతి 124ఎ) సెక్షన్ ఉచితానుచితాల మీమాంసను ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించబోడం ఎంతైనా హర్షించదగిన పరిణామం. దేశంలో ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా వర్ధిల్లాలని కోరుకునే వారికి హితవైన అంశం. తాము కొత్త చట్టాలు తీసుకురాబోతున్నందున ఈ చర్యను వాయిదా వేయవలసిందిగా కేంద్రం చేసిన విజ్ఞప్తిని త్రోసిపుచ్చి మరీ సుప్రీం ధర్మాసనం ఇలా నిర్ణయించడంలో ఔచిత్యం కనిపిస్తున్నది. వలస పాలకుల హయాం నాటి భారత శిక్షాస్మృతి (ఐపిసి) నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి) సాక్షాల శాసనం స్థానంలో కొత్త చట్టాలను తీసుకు రాడానికి అవసరమైన బిల్లులను నెల రోజుల క్రితం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మాట వాస్తవం. పనిలో పనిగా రాజద్రోహ సెక్షన్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు అది పార్లమెంటులో ప్రకటించింది. అందుచేత విస్తృత ధర్మాసనానికి నివేదించే విషయాన్ని వాయిదా వేసుకోవాలని అది సుప్రీంకోర్టును కోరింది. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అందుకు నిరాకరించి విస్తృత ధర్మాసనానికి నివేదించడానికి వీలుగా సంబంధించిన పత్రాలను సిజెఐ ముందు వుంచాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. సెక్షన్ 124ఎ ను రద్దు చేస్తానని ప్రకటించిన కేంద్రానికి నిజంగా ఆ ఉద్దేశం వుందా? ఈ అంశంలోని లోతులను పరిశీలించి చూసినప్పుడు దానికి అటువంటి సదుద్దేశం లేదని స్పష్టంగా తెలుస్తుంది.

సెక్షన్ 124ఎకి బదులు కొత్త చట్టంలో కేంద్రం ప్రవేశపెట్టదలచిన 150వ సెక్షన్ మరింత కఠినంగా వుండబోతున్నట్టు బోధపడుతున్నది. ఎందుకంటే భారతీయ న్యాయ సంహిత బిల్లు పేరిట రాబోతున్న కొత్త చట్టంలోని 150వ సెక్షన్ నేరుగా రాజద్రోహం అనే పదం వాడకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించడమనే దానిని దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను బలి తీసుకొనే చర్యగా పేర్కొంటున్నది. అంటే 124ఎ ని తొలగించి 150వ సెక్షన్‌ను తెచ్చుకోడం గోతిలో నుంచి బావిలో పడిన చందమే అవుతుంది.1962లో కేదార్ నాథ్ సింగ్ x బీహార్ ప్రభుత్వం కేసులో రాజద్రోహ సెక్షన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తున్న రాజ్యాంగం 19(1)(ఎ) కి అది విరుద్ధం కాదని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు ఈ సెక్షన్‌ను సమర్థించింది. ఆ తర్వాత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలపై చైతన్యం పెరిగి ఆ సెక్షన్ ప్రమాదాన్ని సమాజం గుర్తించింది.

వాక్ స్వాతంత్య్రాన్నే కాదు చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతున్న రాజ్యాంగం 14వ అధికరణకు కూడా 124ఎ సెక్షన్ ముప్పు కలిగిస్తున్నది. న్యాయ సంహిత బిల్లు ద్వారా ఈ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేయబోతున్నారనే అనుకొన్నప్పటికీ కొత్తగా రాబోతున్న ఈ చట్టం వల్ల ఇంతకు ముందే ఈ సెక్షన్ కింద కేసులు పెట్టిన వారికి మంచి జరగబోదని అందుచేత మొత్తం సెక్షన్‌ను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించడమే సబబని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వివరంగా చెప్పింది. 1962లో కేదార్ నాథ్ కేసును విచారించిన ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులు వున్నందున అప్పటి తీర్పును ప్రభావ రహితం చేయడం కోసం ఈ అంశాన్ని తిరిగి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్‌కి నివేదించడమే సబబని కూడా అభిప్రాయపడింది. తగిన ప్రభుత్వ సంస్థ పునః పరిశీలించి కేంద్ర, రాష్ట్రాలకు ఈవిషయమై స్పష్టమైన సూచనలు ఇచ్చేంత వరకు దేశద్రోహ సెక్షన్ కింద కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు గత ఏడాది మే 11వ తేదీన ఆదేశాలిచ్చింది.

ఈ సెక్షన్ కింద ప్రాథమిక అభియోగ పత్రాల (ఎఫ్‌ఐఆర్‌లు) దాఖలు, దర్యాప్తులు, విచారణలు మొత్తం న్యాయ సంబంధమైన చర్యలన్నింటినీ నిలిపివేయాలని కూడా కోర్టు వివరంగా సూచించింది. ప్రభుత్వం పట్ల అగౌరవాన్ని కలిగించినందుకు 124ఎ కింద గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్‌ను స్వాతంత్య్రానికి పూర్వం 57 ఏళ్ళ కింద 1890లో బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు రూపొందించింది. కేదార్ నాథ్ కేసులో హింసకు ప్రేరేపించడం, శాంతి భద్రతల సమస్యను సృష్టించడం, ప్రజాశాంతికి ముప్పు వాటిల్లజేయడం అనే చర్యలకు మాత్రమే దేశద్రోహ చట్టం వర్తింప చేయాలని తీర్పు ఇవ్వగా, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే ఏ విమర్శనైనా దేశద్రోహం కింద పరిగణించాలని అసలు చట్టం శాసిస్తున్నది. దీనిని 150వ సెక్షన్ రూపంలో కొనసాగింప చేయాలని కేంద్రం ఆశిస్తున్నది. అందుకు లా కమిషన్ చేసిన నిరంకుశ సిఫారసును ఆధారం చేసుకోవాలని చూస్తున్నది. ప్రజాస్వామ్యమంటే రోజురోజుకీ ప్రజల న్యాయమైన స్వేచ్ఛలు బలపడడమే. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు సవ్యంగా పరిపాలించకపోతే వాటిని విమర్శించే హక్కును పోషించడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News