Monday, December 23, 2024

ఆ ‘గుండె చప్పుడు’ ఆపలేం.. గర్భవిచ్ఛిత్తికి నిరాకరించిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తన 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే 24 వారాలు దాటాయని, ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో తల్లికి ఎటువంటి ముప్పూ లేదని, గర్భస్థ శిశువుకు కూడా ఎటువంటి అసాధారణ పరిస్థితి లేదని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా గర్భవిఛ్ఛిత్తికి అంగీకరించడం లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ‘గర్భిణికి ఇప్పటికే 26 వారాల , 5 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తల్లికి ఎటువంటి ముప్పు లేదు. గర్భస్థ శిశువు అసాధారణతకు సంబంధించి కేసు కూడా కాదు.

ఈ క్రమంలో విచ్ఛిత్తికి అనుమతిస్తే ,… మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రిగ్నెన్సీ యాక్టు లోని సెక్షన్ 3, సెక్షన్5 ఉల్లంఘనే అవుతుంది. ’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆ గుండె చప్పుడును ఆపేందుకు కోర్టు సుముఖంగా లేదన్నారు. ప్రస్తుతానికి ఆ మహిళ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారని.. ఆ ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చిన్నారి పుట్టిన తర్వాత స్వయంగా పెంచుకోవడమా లేదా దత్తత ఇచ్చే అంశంపై తల్లిదండ్రులు తర్వాత నిర్ణయం తీసుకోవచ్చన్నారు.

తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రసవానంతర కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా , ఆర్థికంగా, తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనందున గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వాలంటూ ఓ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఆధారంగా అక్టోబర్ 9న ఆ మహిళ 26 వానాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేయడానికి సుప్రీం కోర్టు అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు చేరింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం , ఆ తల్లి విజ్ఞప్తిని నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News