Monday, December 23, 2024

ఎన్‌ఐఎకి మొట్టికాయలు!

- Advertisement -
- Advertisement -

 

దాదాపు మూడు వారాల క్రితం తాను జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం దేశంలో ప్రజాస్వామిక హక్కులకు లభించిన ఒక మాదిరి భరోసా వంటిది. కేసు నిరవధికంగా సాగుతున్నప్పుడు వయో వృద్ధులై అనారోగ్యంతో జైల్లో మగ్గుతున్న నిందితులకు వీలైనంత వెసులుబాటు కల్పించాలన్న మానవతా దృష్టితో అత్యున్నత న్యాయస్థానం ఎన్‌ఐఎని మందలించి దారికి తేవలసి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఎల్గార్ పరిషద్ కేసులో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు చేసి నేవీ ముంబైలోని తలోజా జైల్లో నిర్బంధంలో వుంచిన సీనియర్ హక్కుల కార్యకర్త గౌతమ్ (70) నవలఖాను అక్కడి నుంచి విడుదల చేసి గృహ నిర్బంధంలో వుంచాలని సుప్రీంకోర్టు ఈ నెల 10వ తేదీన ఆదేశించింది.

ఎన్‌ఐఎ ఆ ఉత్తర్వులను అమల్లో పెట్టకుండా వాటిని వెనుకకు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన కోర్టు ఎన్‌ఐఎ వాదనలలోని మొండితనాన్ని గమనించి దాని విన్నపాన్ని తిరస్కరించింది. అలాగే తన ఉత్తర్వులను 24 గం.ల్లోగా అమలు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఎన్‌ఐఎ పాటించక తప్పలేదు. అయితే నవలఖాను నిర్బంధంలో వుంచే ఇంటిని మరింత దుర్భేద్యం చేయడానికి వీలుగా తన ఉత్తర్వులకు అవసరమైన సవరణలను చేసింది. అసాధారణమైన బలం, బలగాలున్న ఎన్‌ఐఎ అనారోగ్యంతో నీరసించి వున్న 70 ఏళ్ళ వృద్ధుడు గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించి పారిపోకుండా చూడలేదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

అంతేకాదు గృహ నిర్బంధానికి నవలఖా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని ఎంచుకోడం పట్ల ఎన్‌ఐఎ అభ్యంతరం తెలపగా సిపిఐ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదా అని ప్రశ్నించి ధర్మాసనం దాని నోరు మూయించింది. ఏదో సందు చూసుకొని ఉత్తర్వుల అమలును వాయిదా వేయడానికి ప్రయత్నించ వద్దని గుడ్లురిమింది. 2018 నాటి భీమాకోరెగామ్ హింసాకాండకు సంబంధించి ఉపా కింద దాఖలు చేసినదే ఎల్గార్ పరిషద్ కేసు. నక్సలైట్లు పన్నిన కుట్రలో భాగస్వాములంటూ గౌతమ్ నవలఖా సహా 16 మందిని 2018లో అరెస్టు చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి వరవర రావు (82) కూడా వీరిలో ఒకరు. ఈ కేసులోనే అనారోగ్యంతో బాధపడుతూవచ్చిన వయోవృద్ధుడు మరో ప్రముఖుడు స్టాన్ స్వామి జైల్లో మరణించారు.

అందుచేత నిందితుల వయసును, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని వారి ప్రార్థనను మన్నించి వారికి ఎంతో కొంత స్వేచ్ఛను ప్రసాదించాలని సుప్రీంకోర్టు తీసుకొన్న నిర్ణయం ప్రశంసించదగినది. దాని వల్ల దేశ భద్రతకు పెనుముప్పు వాటిల్లుతుందనే కారణంతో పోలీసు వ్యవస్థ అడ్డు నిలబడడం దేశంలోని ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. పాలకుల వైఖరికి కొమ్ముకాయడం తప్ప తాము కూడా ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలో భాగమేనని అది నిర్దేశించిన విలువలను గౌరవించవలసిన బాధ్యత తమపై వున్నదని పోలీసు అధికారులు తెలుసుకోకపోడం ఎంతో బాధ కలిగించే అంశం. విచారణను వాయిదా వేయవలసిందన్న ఎన్‌ఐఎ అభ్యర్థనను కూడా న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, హృషికేష్ రాయ్‌ల ధర్మాసనం త్రోసిపుచ్చి తన ఉత్తర్వుల తక్షణ అమలుకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది.

దానితో ఏమీ అనలేకపోయిన ఎన్‌ఐఎ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నవలఖా మాదిరిగానే 70 ఏళ్ళు దాటి ఇంతకంటే తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న ఖైదీలెంతో మందికి జైల్లోనే చికిత్స జరుగుతున్నదని అన్నారు. అంతేకాదు నక్సలిజాన్ని మెతక వైఖరితో ఎదుర్కోలేమన్నది తన అభిప్రాయమన్నారు. దానికి మీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు మీకు వుందని అంటూ ధర్మాసనం మౌనాన్ని పాటించింది. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ పాలకుల కంటే అధికంగా పాశవికతను ప్రదర్శించడానికి వెనుకాడ్డం లేదని రుజువవుతున్నది.

నవలఖాతో పాటు ఎల్గార్ పరిషద్ కేసులోని మరో నిందితుడు పౌర హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ ఆనంద్ తేల్‌తుంబేకి సైతం ఊరట లభించింది. తలోజా జైల్లోనే వున్న ఆయనకు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దానిపై ఎన్‌ఐఎ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వారం రోజులు వ్యవధిని ఇస్తూ బెయిల్ అమలును అప్పటికి వాయిదా వేసింది. ఏ కేసు ఎంత తీవ్రమైనది అనేది కాదు. అత్యున్నత న్యాయస్థానం అనేక కోణాల్లో ఆలోచించి నిందితులకు మానవతా దృష్టితో వీలు కల్పించడానికి నిర్ణయించుకొన్నప్పుడు దానిని పోలీసు సంస్థలు అదే పనిగా అడ్డుకోజూడడమే దేశంలో పడగ నీడ వంటి పరిస్థితి కొనసాగుతున్నదని అనుకోడానికి ఆస్కారం కలిగిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News