పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే కాకుండా హైబ్రిడ్ మోడ్(ఆన్‌లైన్ విధానం)లో కూడా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలని సిబిఎస్‌ఇ, సిఐఎస్‌సిఇలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. విద్యా వ్యవస్థతో ఆడుకోవద్దంటూ పిటిషనర్లను సుప్రీంకోర్టు మందలించింది. చివరి నిమిషంలో మార్పులను ఎట్టి పరిస్థితిలోను ప్రోత్సహించకూడదని, ఈ దశలో యావత్ పరీక్షా విధానంలో జోక్యం చేసుకుని దాన్ని గందరగోళ పరచడం తగదని కోర్టు అభిప్రాయపడింది.
ప్రస్తుతం జరుగుతున్న 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే కాక హైబ్రిడ్ మోడ్‌లో కూడా నిర్వహించేలా సిబిఎస్‌ఇ, సిఐఎస్‌సిఇలను ఆదేశించాలని కోరుతూ ఆరుగురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సిబిఎస్‌ఇకి చెందిన టర్మ్ ఒన్ బోర్డు పరీక్షలు నవంబర్ 16న ప్రారంభం కాగా సిఐఎస్‌సిఇకి చెందిన సెమిస్టర్ ఒన్ బోర్డు పరీక్షలు నవంబర్ 22 నుంచి మొదలు కానున్నాయి. ఆఫ్‌లైన్ మోడ్‌లో బోర్డు పరీక్షలు నిర్వహించడానికి అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సంఖ్యను 6,500 నుంచి 15,000కు పెంచామని సిబిఎస్‌ఇ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.