Friday, December 20, 2024

నెలసరి సెలవులు ఇవ్వాలని ఆదేశించలేం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చేలా రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తెలిపింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. ఈ పిల్‌ను పరిశీలించిన ధర్మాసనం వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయ విద్యార్థి వాదనను పరిగణనలోకి తీసుకుంది. నెలసరి సెలవులు మంజూరు చేయాలని యజమానులను బలవంతం చేస్తే మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారు వెనుకాడవచ్చనే వాదనతో ఏకీభవించింది.

‘మేము దీనిని తిరస్కరించడం లేదు. కానీ ఈ కారణం చూపెట్టి అనేక మంది యజమానులు మహిళకు ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యకు భిన్నమైన కోణాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే తర్వాత పరిశీలిస్తాము’ అని — జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెక్షన్ 14 మెటర్నిటీ బెన్‌ఫిట్ యాక్ట్ 1961 ప్రకారం నెలసరి సెలవులు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News