మారటోరియంను పొడిగించమని చెప్పలేం
ఆర్థిక విధానాలపై న్యాయసమీక్ష జరపలేం:సుప్రీంకోర్టు స్పష్టీకరణ
మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీని విధించవద్దని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ: ఆర్థిక ప్యాకేజిలు, ఉద్దీపనలు ప్రకటించాలని, కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మారటోరియం కాలానికి ఎలాంటి వడ్డీపై వడ్డీని విధించవద్దని కోర్టు ఆదేశించింది. ఒక వేళ ఇప్పటికే వడ్డీ వసూలు చేసి ఉంటే రుణ గ్రహీతలకు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే ఆగస్టు 31వరకు ఉన్న రుణ మారటోరియం కాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన అనంతరం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని వెల్లడించింది.
అలాగే ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. చక్రవడ్డీ మాఫీ రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలకు పరిమితం చేయడంతో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు.. రూ.2 కోట్లకంటే ఎక్కువ ఉన్న రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. అయితే మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే డిపాజిటర్లకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉన్నందున పూర్తి వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం తెలిపింది. చక్రవడ్డీని మాఫీ చేయడం వల్ల బ్యాంకులపై గణనీయంగా ఆర్థికభారం పడుతుందని, డిపాజిటర్లు, ఆర్థిక స్థిరత్వానికి విపరీతమైన చిక్కులు తెచ్చిపెడుతుందని ఆర్‌బిఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.అలాగే ఆర్‌బిఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి రుణాలు, అడ్వాన్సుపై వడ్డీని వదులుకుంటే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లకంటే ఎక్కువ ఉంటుందని ఇదివరకే కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. ఈ భారాన్ని బ్యాంకులు భరిస్తే దీర్ఘకాలంలో పెనుభారం పడుతుందని గుర్తు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి 1నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటిస్తున్నామని, రుణాలు, వడ్డీలకు సంబంధించి కిస్తీల చెల్లింపును వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటూ గత ఏడాది మార్చి 27న రిజర్వ్ బ్యాంక్ ఒక సర్కులర్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది.
Supreme Court Refuses to extend loan Moratorium