చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ప్రధాని ప్రకటనను గుర్తు చేసిన ధర్మాసనం
ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఇదే అంశంపై ప్రధాని మోడీ చేసిన ప్రకటనను చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పిటిషనర్‌కు గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. పిల్‌ను ఉపసంహరించుకొని మీరు చెప్పాలనుకొన్నది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది.
జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లు బుధవారం తిరస్కరణకు గురయ్యాయి. ఆ ఘటనలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఇద్దరు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీతో దర్యాప్తునకు ఆదేశించాలని విశాల్‌తివారీ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ప్రధాని ప్రకటనను గుర్తు చేసిన ధర్మాసనం పిల్‌ను ఉపసంహరించుకోవాలని తివారీకి సూచించింది. ఆరోజు జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసపై శిఖాదీక్షిత్ వేసిన మరో పిటిషన్ విషయంలోనూ సుప్రీంకోర్టు ఇదే సూచన చేసింది. పోలీస్ దర్యాప్తు ఏకపక్షంగా జరిగే అవకాశమున్నదన్న తివారీ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ అలా జరుగుతుందని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. వారు అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకొనే దర్యాప్తు జరుపుతారనే భావిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనలపై న్యాయవాది ఎంఎల్ శర్మ మరో పిటిషన్ వేశారు. సాక్షాధారాలు లేకుండా అధికారులు, మీడియా రైతులను ఉగ్రవాదులుగా ప్రచారం చేయడాన్ని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన తన పిటిషన్‌లో కోరారు. రైతుల ఆందోళనను అణచివేసేందుకు ఓ ప్రణాళికతో జరిగిన కుట్రే ఆరోజున హింసాత్మక ఘటనలకు కారణమని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపైనా విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.