అక్రమ కట్టడాల తొలగింపుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ఇటీవల ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఓ వర్గం వారిని లక్షంగా చేసుకుని యూపీ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా స్పందించింది. యూపీతోపాటు ఇదే ప్రక్రియను అనుసరిస్తోన్న మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల స్పందనను తెలియజేయాలని నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు, ఈ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను యోగీ ప్రభుత్వం చేపట్టింది. వీటిని వ్యతిరేకిస్తూ జమియత్‌ఉలామాఇహింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మరోసారి విచారించింది. మతపరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేశ వ్యాప్తంగా ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ పిటిషనర్ తరఫున న్యాయవాదులు దుష్యంత్‌దవే, సీయూ సింగ్‌లు వాదించారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మన సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేలు, అల్లర్లకు కూల్చివేతలకు సంబంధం లేదని వివరించారు. ఉభయ వర్గాల వాదనలు విన్న తరువాత జమియత్ ఉలామా ఇహింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 10న మరోసారి విచారణ జరుపుతామని పేర్కొంది.