న్యూఢిల్లీ : ఇవిఎంల ద్వారా పోలైన వోట్లను వివిప్యాట్ స్లిప్‌లతో నూరు శాతం సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిఐఎల్‌లను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అదే సమయంలో ప్రస్తుత ఇవిఎం విధానాన్ని పటిష్ఠం చేసేందుకు ఎన్నికల కమిషన్ (ఇసి)కి సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సూచనలు చేసింది. ‘ప్రోటోకాల్స్, సాంకేతిక అంశాలను మేము విస్తృతంగా చర్చించాం& అన్ని పిటిషన్లనూ కొట్టివేశాం’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ వివాదాస్పద అంశంపై తీర్పును బెంచ్ ఈ నెల 18న రిజర్వ్ చేసింది. ఇవిఎంలు, వివిప్యాట్ మెషీన్ నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలపై వివరణల నిమిత్తం బెంచ్ ఆరు రోజుల తరువాత అంటే బుధవారం (24న) సీనియర్ ఇసి అధికారులను పిలిపించింది. అయితే, ఇవిఎం విధానం పటిష్ఠత కోసం ఇసికి బెంచ్ రెండు ఆదేశాలు జారీ చేసింది. ‘ఒక ఆదేశం ఏమిటంటే, మే 1న లేదా ఆతరువాత ఇవిఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పుడు సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్‌ఎల్‌యు)ను సీల్ చేసి, కంటైనర్లలో భద్రపరచాలి. అభ్యర్థులు, వారి ప్రతినిధులు సీల్‌పై సంతకం చేయాలి.
ఎస్‌ఎల్‌యులు ఉన్న సీల్ చేసిన కంటైనర్లను ఫలితాల ప్రకటన తరువాత కనీసం 45 రోజుల పాటు ఇవిఎంలతో పాటు స్టోర్ రూమ్‌లలో ఉంచాలి. ఇవిఎంల విషయంలో వలె వాటిని తెరచి, పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి’ అని జస్టిస్ ఖన్నా తీర్పు వెలువరిస్తూ తెలియజేశారు. ‘అత్యధిక వోట్లు వచ్చిన అభ్యర్థి తరువాత రెండు, మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల లిఖితపూర్వక అభ్యర్థనపై ఏదైనా ట్యాంపరింగ్ లేదా సవరణ కోసం ఫలితాల ప్రకటన అనంతరం ఇవిఎం తయారీ సంస్థల నుంచి ఇంజనీర్ల బృందంతో 5 శాతం ఇవిఎంలలో మెమరీ బర్న్ అయిన సెమీ కంట్రోలర్, అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్, వివిప్యాట్, అసెంబ్లీ నియోజకవర్గానికి, పార్లమెంటరీ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించినవి పరిశీలించి, నిర్ధారించాలి’ అని బెంచ్ ఆదేశించింది. ‘అటువంటి అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు పోలింగ్ కేంద్రం లేదా వరుస సంఖ్య ద్వారా ఇవిఎంలను గుర్తించాలి. నిర్ధారణ సమయంలో అభ్యర్థులు అందరూ, వారి ప్రతినిధులు హాజరు కావాలంటే కావచ్చు. అటువంటి అభ్యర్థనను ఫలితాల ప్రకటన తేదీ తరువాత ఏడు రోజుల్లో చేయవలసి ఉంటుంది’ అని సుప్రీం కోర్టు సూచించింది. ‘జిల్లా ఎన్నికల అధికారి (డిఇఒ) ఇంజనీర్ల బృందాన్ని సంప్రదించి బర్న్ మెమరీ మైక్రో కంట్రోలర్ సాధికారతను,
చెక్కుచెదరని స్థితిని నిర్ధారించవలసి ఉంటుంది. నిర్ధారణ ప్రక్రియ నిర్వహించిన అనంతరం సదరు నిర్ధారణకు అసలు ఖరీదు లేదా ఖర్చులను ఇసిఐ నోటిఫై చేస్తుంది. సదరు అభ్యర్థన చేసిన అభ్యర్థి ఆ ఖర్చులను చెల్లించాలి. ఇవిఎంలను ట్యాంపర్ చేసినట్లు కనుగొన్నప్పుడు ఖర్చులను వాపసు చేస్తారు’ అని బెంచ్ ఆదేశించింది. వివిప్యాట్ స్లిప్‌ల లెక్కింపునకు ఎలక్ట్రానిక్ మెషీన్ ఉపయోగించాలని, ప్రతి పార్టీకి సంబంధించి సింబల్‌తో పాటు మనం బార్‌కోడ్ ఉపయోగించగలమా అనే సూచనను పరిశీలించాలని ఇసిని జస్టిస్ ఖన్నా కోరారు. ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే విడిగా తీర్పు వెలువరించిన జస్టిస్ దత్తా పిటిషనర్లకు ఒక విధమైన హెచ్చరిక చేశారు. ‘సిస్టమ్‌లు లేదా సంస్థలను మదింపు వేయడంలో సమతూకం పాటిస్తూనే సిస్టమ్‌లో ఏ అంశాలపైనైనా అపనమ్మకం కలిగి ఉండడం అవాంఛిత విమర్శలకు దారి తీస్తుంది, పురోభివృద్ధిని అడ్డుకుంటుంది. దానికి బదులుగా, సిస్టమ్ విశ్వసనీయత, ప్రభావశీలత కొనసాగేందుకు, అర్థవంతమైన మెరుగుదలలకు అవకాశం కల్పిస్తూ దాఖలాలతో, సహేతుకతతో నిర్మాణాత్మక దృక్పథం అనుసరించడం ప్రధానం’ అని జస్టిస్ దత్తా అన్నారు. వివిప్యాట్ స్లిప్‌లను నూరు శాతం ఇవిఎం వోట్లతో సరిపోల్చాలని పిటిషనర్ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) కోరింది.