Thursday, December 19, 2024

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుకు సుప్రీం కోర్టు బుధవారం నిరాకరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తు సంస్థ స్పందనను కోర్టు కోరింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణ ప్రారంభం కాగా, కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తూ, ఈ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరుకు కఠిన షరతులు విధించినప్పటికీ మూడు సందర్భాల్లో బెయిల్ మంజూరైందని తెలియజేశారు.

మే 10, జూలై 12 తేదీల్లో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను, జూన్ 20న విచారణ కోర్టు మంజూరు చేసిన మామూలు బెయిల్‌ను సింఘ్వి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జూన్ 20 నాటి విచారణ కోర్టు ఉత్తర్వుపై ‘మౌఖిక ప్రస్తావన’పై ఢిల్లీహైకోర్టు స్టే ఇచ్చిందని సింఘ్వి తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కఠిన షరతులు విధించినప్పటికీ కేజ్రీవాల్ బెయిల్ పొందగలిగినప్పుడు మనీలాండరింగ్ చట్టం వంటి అటువంటి కఠిన నిబంధనలు అ కోపవినీతి నిరోధక చట్టం (పిసిఎ)లో లేనందున సిబిఐ కేసులో మామూలు బెయిల్‌ను నిరాకరించరాదని సింఘ్వి వాదించారు. ‘అలా చెప్పడానికి నేను ఇష్టపడను. కానీ నేను ప్రతి చోట చెప్పాను. ఈ నిర్దిష్ట అరెస్టును బీమా అరెస్టు అనవచ్చు. ఏప్రిల్ 23న మీరు నన్ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు.

ఇడి నన్ను మార్చి 24న అరెస్టు చేసేంత వరకు మీ వద్ద నుంచి తిరిగి ఎటువంటి చర్యా లేదు. నాకు మూడు విడుదల ఉత్తర్వులు వచ్చాయి. సరిగ్గా ఉత్తర్వు వచ్చే సమయానికి నన్ను జూన్‌లో అరెస్టు చేశారు’ అని సింఘ్వి చెప్పారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితుల గురించి సింఘ్వి ప్రస్తావిస్తూ, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యంతర బెయిల్ కోసం అర్జీని ఇప్పటికే దాఖలు చేసినట్లు ఆయన తెలియజేశారు. ‘మేము మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లేదు’ అని సర్వోన్నత న్యాయస్థానం సింఘ్వితో చెప్పింది. అప్పుడు ‘వీలైనంత సత్వర తేదీ’ కోసం సీనియర్ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23న విచారణ జరుపుతామని బెంచ్ తెలిపింది. ముఖ్యమంత్రి అరెస్టును చట్టబద్ధమైనదిగా ఢిల్లీ హైకోర్టు ఈ నెల 5న ధ్రువీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News