న్యూఢిల్లీ: ముహ్మద్ ప్రవక్త(స)పై వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెను వివాదాన్ని రేపిన బిజెపి బహిష్కృత నేత నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణకు నిరాకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన పిటిషనర్‌కు సదరు పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయగా, సదరు పిటిషన్‌ను పిటిషనర్ వాపస్ తీసుకున్నారు.
నుపుర్ శర్మపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ సుప్రీంకోర్టే తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నుపుర్ శర్మపై దాఖలైన కేసులన్నింటినీ కూడా ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాలేమీ తెలియనట్టుగా నుపుర్‌ను అరెస్ట్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు.