Friday, November 15, 2024

ఈవీఎంలపై ‘పిల్ ’ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఇవిఎం) ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌పై ఆడిట్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నిబంధనలు ఉల్లంఘించినట్టు చూపించే ఆధారాలేవీ పిటిషనర్ సమర్పించలేదని పేర్కొంది. ఈవీఎం సోర్స్‌కోడ్‌పై ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పరిశీలించింది.

అనంతరం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ‘ఎన్నికల నియంత్రణను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అప్పగించారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలను పిటిషనర్ కోర్టుకు అందించలేదు. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానాలు కలిగించే ఏ సమాచారాన్ని ఇవ్వలేదు’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్నేళ్ల క్రితం బ్యాలెట్ స్థానంలో తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో లోక్‌సభ , అసెంబ్లీల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.

అయితే వాటి పనితీరుపై కొందరు అనేక సందర్భాలలో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉపయోగించిన సోర్స్ కోడ్‌పై ఆడిట్ చేపట్టాలని కోరుతూ సునిల్ ఆహ్యా అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ‘సోర్స్ కోడ్ అనేది ఈవీఎంకు ఎంతో కీలకం. ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించింది’ అని ఇందులో పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆడిట్ నిర్వహించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News