Thursday, November 21, 2024

ప్రశాంత్ కిశోర్‌కు సుప్రీం కోర్టు షాక్

- Advertisement -
- Advertisement -

బుధవారం (13న) జరగనున్న బీహార్ ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాజకీయ నేతగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఉప ఎన్నికల కార్యక్రమంలో జోక్యం చేసుకునేందుకు వ్యవధి లేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని న్యాయమూర్తులు సూర్య కాంత్, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దానిని విధానపరమైన అంశంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంటూ, అటువంటి వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని, బీహార్ ఉప ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పింది. ‘ఇతర రాజకీయ పార్టీలకు సమస్య లేదు. మీకు మాత్రమే సమస్య ఉంది.

మీరు కొత్త రాజకీయ పార్టీ, ఇటువంటి వ్యవహారాల గురించి మీరు తెలుసుకోవడం అవసరం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. బీహార్‌లో ఛట్ పూజ వంటి ముఖ్యమైన ఇతర పండుగ ఏదీ లేదని పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కేరళలలో ఎన్నికల తేదీలను మతపరమైన కార్యక్రమాల ప్రాతిపదికపై ఎన్నికల కమిషన్ ముందుకు జరిపిందని, కానీ, ఛట్ పూజ పండుగ ఉన్నప్పటికీ బీహార్ ఎన్నికల విషయంలో ఆ విధంగా వ్యవహరించలేదని పిటిషనర్ వాదించారు. బీహార్‌లోని రామ్‌గఢ్, తరారి, బేలాగంజ్, ఇమామ్‌గంజ్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు బుధవారం (13న) నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News