న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద ఈ దశలో తాము జోక్యం చేసుకోవడం సబబు కాదని, తొందరపాటు అవుతుందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అది క్విడ్ పో కో లేదా కాంట్రాక్టు ఇవ్వడం అన్న అభిప్రాయంతో ఎన్నికల బాండ్ల కొనుగోలుపై తాము దర్యాప్తునకు ఆదేశించలేమని ధర్మాసనం తెలిపింది.
న్యాయ సమీక్షకు అర్హమైనవన్న అభిప్రాయంతో ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు అనుమతించింది. నేరపూరితమైన కార్యకలాపాలపై చర్యల కోసం చట్ట పరిధిలో వేరే పరిష్కార మార్గాలు ఉండగా ఈ కేసులను ఆర్టికల్ 32 కింద విచారణకు స్వీకరించలేమని పిటిషనర్లు కామన్ కాజ్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్, ఇతర ఎన్జీవోలకు ధర్మాసనం తెలిపింది. ఎన్నికల బాండ్ల పథకం కింద రాజకీయ పార్టీలు, కార్పొరేషన్లు, దర్యాప్తు సంస్థల మధ్య క్విడ్ పో కో జరిగిందని ఆరోపిస్తూ రెండు ఎన్జీవోలు పిల్ దాఖలు చేశాయి.